ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని... సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది క్రైమ్ రేట్ ఓవరాల్‌గా 5.2 శాతం తగ్గిందని.. అయితే సైబర్ క్రైమ్ రేట్ మాత్రం కొంత పెరిగిందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఏడాది పెద్దపీఠ వేశామన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ప్రాపర్టీ అఫెన్స్స్‌లో గత సంవత్సరం కంటే క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందన్నారు. పోలీసులు తీసుకున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు కూడా కొంత మేర తగ్గాయని తెలిపారు.
సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళ కలిగిస్తోందన్నారు. డిజిటల్ అరెస్టులపై ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లు ఉన్నాయన్నారు.గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. గంజాయి రహిత ఏపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు.10, 837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించామని తెలిపారు. ఈగల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. గంజాయిని నిర్మూలించడంలో డ్రోన్స్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మనిషి వెళ్లలేని ప్రదేశానికి కూడా డ్రోన్ వెళ్తుతుందన్నారు. 10 పోలీస్ స్టేషన్లకు ఒక డ్రోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు.