ఇమ్మిగ్రేషన్ అంశం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పార్టీ... ఎలాన్ మస్క్ మధ్య చిచ్చు రేపుతోంది. చట్టబద్ధమైన వలసలకు మస్క్ మద్దతు ఇస్తుంటే.. రిపబ్లికన్ పార్టీలోని ట్రంప్ మద్దతుదారులు అమెరికా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నారు. దాంతో వివాదం మొదలైంది. ఈక్రమంలో ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టి పోస్ట్ మరింత అగ్గి రాజేసింది. ధిక్కరించే మూర్ఖులను రిపబ్లికన్ పార్టీ నుంచి తొలగించాలని ఘాటుగా ట్వీట్ చేశారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ క్రమంలో తన కార్యవర్గంలోకి పలువుర్ని తీసుకుంటున్నారు. వీరిలో భారతీయ అమెరికన్లు సైతం ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు భారతీయులను తన యంత్రాంగంలో నియమించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శ్వేతసౌధం సీనియర్ పాలసీ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్‌ను ఎంపిక చేయడం విమర్శలకు దారితీసింది. నైపుణ్యం కలిగిన విదేశీ వృతినిపుణుల కోసం గ్రీన్‌కార్డుల విషయంలో ఉన్న పరిమితులను ఎత్తివేయాలని గతంలో శ్రీరామ్ డిమాండ్ చేశారు. దీంతో శ్రీరామ్ నియామకాన్ని ట్రంప్ మద్దతుదారుల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
దక్షిణాఫ్రికా పౌరుడైన ఎలాన్ మస్క్.. అమెరికాకు హెచ్-1బీ వీసాపై వలస వచ్చారు. ప్రతిభ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలని ఎప్పుడూ అంటూ ఉంటారు. ‘‘మీ టీమ్ విజయం సాధించాలంటే.. అద్భుతమైన ప్రతిభావంతులు ఎక్కడున్నా మన టీమ్‌లో చేర్చుకోవాలి’’ అని ఓ సందర్భంలో అన్నారు. భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి సైతం మస్క్ వాదనను సమర్దిస్తారు. భారత్ నుంచి వలసవచ్చిన కుటుంబంలో జన్మించిన ఆయన... అమెరికా సంస్కృతిలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. లోటుపాట్లు ఉన్న ఈ కల్చర్ అత్యుత్తమ ఇంజినీర్లను తయారుచేయడం లేదని.. అందు కారణంగా దిగ్గజ సంస్థలన్నీ విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించకుంటున్నాయనే అర్థంలో విమర్శలు చేశారు.
అయితే, రిపబ్లికన్ పార్టీకి చెందిన సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ భిన్నంగా స్పందించారు. ‘నేను సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్నప్పుడు నిరుద్యోగిత రేటు 11 నుంచి 4 శాతానికి తగ్గిపోయింది.. విదేశీ ఉద్యోగులకు బదులు పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైంది... కొత్త ఉద్యోగాల కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వడం వల్ల ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్ రంగాల్లో రాణిస్తున్నారు. సాంకేతికంగా బలోపేతం చేయాలని అనుకుంటే ముందు విద్యా రంగంపై దృష్టిపెట్టాలి.. అంతేగానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దు’ అని రామస్వామి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
కాగా, ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ అస్థిరమైన వైఖరి గందరగోళానికి గురిచేస్తోంది. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్-1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే, ఇటీవల ఆయన ప్రకటనలు చూస్తే వలసదారుల విషయం ఆయన సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నట్టు అర్దమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో.. అమెరికా యూనివర్సిటీలు విదేశీ గ్రాడ్యుయేట్‌లకు గ్రీన్ కార్డ్‌లను మంజూరు చేయడానికి మద్దతు ఇచ్చారు. దీంతో ఇమ్మిగ్రేషన్ విధానంలో అనిశ్చిత నెలకుంది.