ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్ విలువలను ఫిబ్రవరి 1 నుంచి పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా వెల్లడించారు.రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, సగటున 15% నుంచి 20% వరకు పెంచాలని, కానీ కొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న విలువలు కొనసాగించాలని సూచనలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో కొన్ని ప్రాంతాల్లో అడ్డగోలుగా పెంచిన రిజిస్ట్రేషన్ విలువలను ఇప్పుడు తగ్గించడం జరిగిందని ఆయన తెలిపారు.జిల్లా కమిటీల సూచించిన కొత్త విలువలపై మరోసారి సమీక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. జనవరి 15 నాటికి, తుది ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.మంత్రివర్గ సమావేశంలో.. తాడేపల్లి ఐజీ కార్యాలయంలో సోమవారం, మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ, జిల్లా రిజిస్ట్రార్లు, జిల్లా ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ''గత వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను శాస్త్రీయంగా పెంచలేదు. నరసరావుపేటలో ఎకరానికి కోటిన్నర విలువ పెంచారు. మా ప్రభుత్వం దాన్ని 20 లక్షలకు తగ్గిస్తోంది. మేము గణనీయమైన మార్పులు చేస్తున్నాం'' అని మంత్రి వెల్లడించారు.
ఈ రిజిస్ట్రేషన్ విలువలు పెరిగిన ప్రాంతాలలో సగటున 15% నుంచి 20% మధ్య పెంపు ఉంటుంది. కొన్నిచోట్ల విలువలు తగ్గించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా చరిత్రలో మొదటిసారి కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు తగ్గించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ పెంపు/తగ్గింపులు గ్రామాల అభివృద్ధి, గ్రోత్ కారిడార్ల ఆధారంగా నిర్ణయించబడతాయని ఆయన చెప్పారు. ''రాజ్యవాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భూమి రేట్లు భారీగా పెరిగాయి, వాటి ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతాం'' అని సత్యప్రసాద్ తెలిపారు.
ఈ చర్చలో 200 మంది డిజిటల్ అసిస్టెంట్‌లను ఉపయోగించి, ప్రజలకు సులభమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని మంత్రి తెలిపారు. ఇక, రాష్ట్రంలో రెవెన్యూ శాఖ ద్వారా ఇప్పటి వరకు రూ. 6200 కోట్లు ఆదాయం వచ్చిందని, మార్చి నాటికి ఆ ఆదాయం రూ. 10 వేల కోట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, రిజిస్ట్రేషన్ల ద్వారా 6,156 కోట్లు గడిచినట్లు తెలిపారు. ''2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా 9,546 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే'' అని మంత్రి చెప్పారు. ఇతర భూ సమస్యలపై కూడా చర్యలు తీసుకుంటామని, 7 లక్షల మంది ఇంటి స్థలాలు తీసుకోలేదని, వారికి పట్టాలు ఇవ్వడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. 22ఏ నిషిద్ధ జాబితాలో 4 లక్షల ఎకరాలను తొలగించి, 7,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, వీటిని తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.