ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2025 ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్తున్నారు. 2024 ఏడాదికి గుడ్‌బై చెబుతూ.. 2025 కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే భారీగా పార్టీలు, ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. మరికొన్ని దేశాలు ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందామా అని వేచి చూస్తున్నాయి. ఇక కొన్ని దేశాలు రేపు ఉదయం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోనున్నాయి. అయితే కొన్ని దేశాలు 2025కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ సంబరాలు మొదలుపెట్టేశాయి. 2024 ఏడాదిని చరిత్రలో కలిపేసి.. 2025 ఏడాదిని ఎంజాయ్ చేస్తున్నారు.
భారత్‌లో సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత్ కంటే ముందే ఇప్పటికే కొన్ని దేశాలు న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేశాయి. పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి దీవుల్లో నివసించే ప్రజలు.. ప్రపంచ దేశాల కంటే ముందే ( మధ్యాహ్నం 3.30 గంటలకు) కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కిరిబాటి దీవుల తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన చాతమ్ ఐలాండ్స్ (మధ్యాహ్నం 3.45 గంటలకు) 2025లోకి అడుగు పెట్టింది. ఇక న్యూజిలాండ్ కూడా సాయంత్రం 4.30 గంటలకు కొత్త ఏడాదిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో న్యూ ఇయర్ ప్రారంభం
భారత్ కంటే ఐదున్నర గంటల ముందే ఆస్ట్రేలియాలో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది.
సూర్యుడు ఉదయించే దేశంగా పేరు గాంచిన జపాన్ కూడా భారత్ కంటే మూడున్నర గంటల ముందే 2025లోకి అడుగుపెట్టనుంది.
జపాన్‌తోపాటే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశించనున్నాయి.
భారత్‌కు పొరుగున ఉన్న దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్.. మనకంటే అరగంట ముందు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించనున్నాయి.
మన దేశంలో 12 గంటలకు న్యూ ఇయర్ వేడుకలు మొదలు కానున్నాయి.
భారత్‌తో పాటు శ్రీలంక కూడా ఒకేసారి జనవరి 1వ తేదీని ఆహ్వానం పలకనుంది.
భారత్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అయిన తర్వాత నాలుగున్నర గంటలకు జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు మొత్తంగా ఒకేసారి 43 దేశాలు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి.
ఇక భారత్‌లో కొత్త ఏడాది ప్రవేశించిన తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
భారత్‌లో జనవరి 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు అమెరికాలోని న్యూయార్క్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నాయి.
ఇక ప్రపంచంలోనే చిట్టచివరిగా అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాయి.
రష్యాలో రెండుసార్లు న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1వ తేదీన.. పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14వ తేదీన మరోసారి కొత్త ఏడాది వేడుకలు జరగనున్నాయి.
జనవరి 1వ తేదీని న్యూ ఇయర్‌గా జరుపుకోని దేశాలు
ఇక జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం జరుపుకోని దేశాలు కూడా ఉన్నాయి. చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం లాంటి దేశాలు జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోకుండా.. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటారు.