అఫ్గనిస్థాన్ పౌరులే లక్ష్యంగా ఇటీవల పాకిస్థాన్ చేపట్టిన వైమానిక దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. అమాయక పౌరులపై జరిగే ఎటువంటి దాడినైనా నిస్సందేహంగా ఖండిస్తామని స్పష్టం చేసింది. తన అంతర్గత వైఫల్యాలను పొరుగుదేశాలపైకి నెట్టేయడం పాకిస్థాన్‌కు అలవాటేనని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 26న అఫ్గనిస్థాన్ పక్తియా ప్రావిన్సుల్లో పాకిస్థాన్ వైమానిక దళం జరిపిన దాడుల్లో కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. అటు, పాకిస్థాన్‌పై ప్రతీకార దాడి తప్పదని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించింది.
‘‘అంతర్జాతీయ నియమ, నిబంధనలను ఉల్లంఘించిన ఈ క్రూరమైన చర్యను ఆఫ్గనిస్థాన్ తీవ్రంగా పరిగణిస్తుంది’’ అని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖౌరాజ్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ పిరికిపంద చర్యకు ఇస్లామిక్ ఎమిరేట్ సమాధానం ఇవ్వకుండా నిద్రపోదు’’ అని హెచ్చరించారు. పక్తికా ప్రావిన్సులు బార్మల్ జిల్లాలోని నాలుగు గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 46 మంది చనిపోగా మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తర్వాత.. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాక్ ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను తాలిబన్ ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. గత ఏడాది మార్చిలోనూ అఫ్గన్‌పై పాక్ వైమానిక దాడులు చేసింది.. తాజాగా డిసెంబరు 26న మరోసారి దాడులకు పాల్పడింది. పాక్ సైన్యం వైమానిక దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మృతిచెందారు.
ఒకప్పుడు తాలిబన్లతో అంటకాగి... అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ వేళ్లూనుకోవడంలో దాయాది కీలకంగా వ్యవహరించిన అంశం జగమెరిగిన సత్యమే. 2021లో అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత.. అఫ్గన్‌కు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ వెళ్లడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రపంచమంతా తాలిబన్ల ప్రజాకంటక పాలనపై భయాందోళనలు వ్యక్తం చేస్తే.. పాక్ మాత్రం చంకలు గుద్దుకుంది.గిర్రున ఏడాది తిరగకముందే దాని సంతోషం తుస్సుమంది. తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం అఫ్గన్‌లో ఉంటుందని, తాలిబన్లు తమ మాట జవదాటరని ఆశించిన పాకిస్థాన్‌కు భంగపాటు తప్పలేదు. స్నేహం మాట అటుంచితే ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకుంది. ఇప్పుడు తాలిబన్లతో వైరం పెట్టుకుని.. కయ్యానికి కాలుదువ్వుతోంది. అఫ్గన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం ముప్పు ఎదుర్కొంటోంది.