ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం.. నేటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ మూల, ఏ చిన్న ఘటన జరిగినా.. అది కాస్త ఆసక్తికరంగా ఉంటే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది. మీ అరచేతిలోని సెల్‌ఫోన్‌లో వాలిపోతుంది. అలాంటి వైరల్ పోస్టులు, వీడియోలు, వార్తలు నిత్యం అనేకం చూస్తూ ఉంటాం. అయితే అందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నడుస్తూ ఉన్న కారు హఠాత్తుగా పేలిపోయిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
క్లెయిమ్ ఏంటి?
రోడ్డుపై రన్నింగ్‌లో ఉన్న కారు పేలిపోయిన ఘటనకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎలక్ర్టిక్ కారు రన్నింగ్‌లో ఉండగా పేలిపోయిందంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది. "బ్రేకింగ్ న్యూస్ ఈవీ కార్ బ్లాస్ట్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
నిజం ఏంటి?
అయితే ఈ క్లెయిమ్ పూర్తిగా అబద్ధం. వైరల్ అవుతున్న వీడియో అబద్ధమని తేలింది. వైరల్ అవుతున్న వీడియో క్రిమియాలో రష్యన్ నావల్ అధికారి మీద జరిగిన కారు బాంబు దాడికి సంబంధించినదిగా తేలింది.
ఎలా తెలిసిందంటే?
ఫ్యాక్ట్ చెకింగ్‌లో వైరల్ వీడియో అబద్ధమని తేలింది. వీడియోలోని కారు బాంబు పేలుడు ఘటన క్రిమియాలో జరిగినదిగా గుర్తించాం. ఉత్తరప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనం పేలుడు కాదని నిర్థారించాం. వైరల్ వీడియో గురించి సెర్చ్ చేసినప్పుడు అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్లు ఎలాంటి కథనాలు కనిపించలేదు. వీడియో కీ ఫ్రేమ్స్ ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు.. ఆంటికోర్ అనే వెబ్‌సైట్ ప్రచురించిన కారు బాంబు పేలుడు కథనం కనిపించింది. ఈ ఆంటికోర్ వెబ్‌సైట్ ఉక్రెయిన్‌కు చెందినది. ఈ వెబ్‌సైట్‌లో 2024, నవంబర్ 19న ఈ కథనాన్ని ప్రచురించారు. ఈ నివేదికలో వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ ఉంది. రష్యన్ మిస్సైల్ బోట్స్ 41వ బ్రిగేడ్ కమాండర్‌పై ఆక్రమిత సెవాస్టపోల్‌లో జరిగిన దాడి ఫుటేజీగా పేర్కొన్నారు.
ఆంటికోర్ కథనం ప్రకారం.. రష్యన్ మీడియా ఈ వీడియోను రిపోర్ట్ చేసింది. రష్యన్ నేవీ నల్ల సముద్ర నౌకాదళానికి చెందిన 41వ మిస్సైల్ బ్రిగేడ్ కమాండర్ ఈ కారు పేలుడులో చనిపోయినట్లు పేర్కొంది. డిసెంబర్ 17, 2024న డైలీ మెయిల్ వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్‌లో, ‘రష్యన్ నేవల్ ఆఫీసర్ వాలెరీ ట్రాంకోవ్‌స్కీ కారు బాంబు దాడిలో మరణించాడు’ అనే శీర్షికతో ఇదే వీడియోను అప్‌లోడ్ చేశారు. క్రిమియాలో ఉక్రెయిన్ అమలు చేసిన కారు బాంబు హత్యలో రష్యన్ నేవీ అధికారి మరణించిన క్షణాన్ని వీడియోలో చూడొచ్చని డిస్క్రిప్షన్‌లో రాసుకొచ్చారు. అదే వీడియో డైలీ మెయిల్ వెబ్‌సైట్‌లోనూ అప్ లోడ్ చేశారు.
గార్డియన్ పత్రిక కూడా నవంబర్ 13, 2024న ఈ హత్య గురించి కథనం ప్రచురించింది. ‘Russian naval officer accused of ‘war crimes’ killed in Crimea car bombing.’ అంటూ కథనం ప్రచురించింది.
"రష్యన్ నియంత్రణలో ఉన్న ఓడరేవు నగరమైన సెవాస్టోపోల్‌లో కారు బాంబు దాడిని నిర్వహించినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు చెందిన ఒక అధికారి ఉక్రేనియన్ ప్రావ్దా అవుట్‌లెట్‌కు తెలిపారు. ఈ ఘటనలో రష్యన్ కమాండర్ ట్రాంకోవ్‌స్కీ చనిపోయినట్లు కథనం ప్రచురించింది.
ట్రాంకోవ్‌స్కీ పేరు ప్రస్తావించకుండానే రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ దాడిని ధృవీకరించిందని నివేదిక పేర్కొంది. పేలుడు కారణంగా ట్రాంకోవ్‌స్కీ కాళ్లు విరిగిపోయి రక్తగాయాలతో మరణించాడని రష్యా మీడియా పేర్కొంది. పేలుడుకు ముందు ట్రాంకోవ్‌స్కీ ఒక వారం పాటు నిఘాలో ఉన్నట్లు తెలిపింది. ఇంట్లో తయారు చేసిన పేలుడు పరికరాన్ని అమర్చి రిమోట్ సాయంతో పేల్చినట్లు గార్డియన్ నివేదించింది.
ఈ కథనాలు, నివేదికల ఆధారంగా వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని ఎలక్ట్రిక్ కారు పేలుడుకు సంబంధించినది కాదని.. క్రిమియాలో రష్యన్ అధికారి మీద జరిగిన దాడి వీడియోగా నిర్ధారిస్తున్నాం.
ఇది అసలు తీర్పు
వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎలక్ట్రిక్ కారు పేలుడు కాదని.. 2024, నవంబర్ 13న క్రిమియాలో జరిగిన రష్యన్ నేవీ అధికారిపై జరిగిన దాడి వీడియో ధ్రువీకరిస్తున్నాం. కావున వైరల్ వీడియో అబద్ధమని నిర్ధరిస్తున్నాం.