ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల నిర్మాణం, కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తోంది. ముఖ్యంగా రహదారుల విస్తరణ, కొత్త రహదారుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అద్భుత సహకారం అందుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో నాలుగు వరసల రహదారి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్ద ప్రస్తావించారు.
ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాల పరిష్కారానికి కేంద్రం సహకారం కోరారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కడప నుంచి రాయచోటి వరకూ నాలుగు వరసల రహదారిని మంజూరు చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిధులు విడుదల చేయడంతో పాటుగా పనులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
మరోవైపు కడప - రాయచోటి ఘాట్ రోడ్డులో టన్నెల్ నిర్మాణం, నాలుగు లేన్ల రహదారికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. గువ్వల చెరువు ఘాట్‌లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో.. కొండకు సొరంగం తవ్వి, 4 లేన్ల రహదారి నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిలో భాగంగా కడప - రాయచోటి మధ్య సొరంగం నిర్మించనున్నారు. ఆరు కిలోమీటర్ల మేరకు సొరంగం నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనుండటంతో పెద్ద సొరంగాన్ని ఒక్కటే చోట నిర్మించాలా లేదా.. రెండేసి వరుసల రోడ్లకు రెండు సొరంగాలు నిర్మించాలా అనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం కన్సల్టెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.