ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో నిలిచిపోతుందని పవన్ కల్యాణ్ అన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 07:56 PM

ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.. కానీ ఇంకొకరు ఒక సత్సంకల్పంతో, సదాశయంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మనిర్భర్ భారత్ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ప్రజావేదిక సభకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. "కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలకు వారి పరిసరాల శుభ్రత భాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల్లో ధైర్యసాహసాలు నింపితే అది ఒక బలిష్టమైన, పటిష్టమైన భారత్ అవుతుంది. అది ఒక రోజున అఖండ భారత్ అయి తీరుతుంది. భారత్ ను ప్రపంచ దేశాల్లో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధానికి నా తరఫున, ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రెవెన్యూ మంత్రిగా, ఆర్థికమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి, టీడీపీ రథ సారథి అయి, నాలుగోసారి ముఖ్యమంత్రి అయి, తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాజకీయ ఉద్ధండులు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా సహచర మంత్రి నారా లోకేశ్ కు, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, బీజేపీ నేతలకు పేరుపేరునా నమస్కారాలు. మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పేరుపేరునా నమస్కారాలు. ఇవాళ ప్రధాని మోదీ 7 లక్షల మందికి ఉపాధి కల్పించే రూ.2.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అవినీతితో కూరుకుపోయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విలవిల్లాడుతున్న తరుణంలో మీరు మా కోసం నిలబడ్డారు. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మాకు అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. 24 గంటలు తాగునీరు, మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయగలుగుతున్నామంటే అందుకు కారణం మోదీ గారు వెన్నుతట్టి మద్దతుగా నిలుస్తున్నారు. గత ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఏపీ అంధకారంలో మునిగిపోయినప్పుడు... ఆంధ్రాకు ఇక ఎలాంటి అవకాశమే లేదు అనుకున్న సమయంలో... ఇటువంటి స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అనుకునేలా చంద్రబాబు నాయకత్వంతో ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో వారి సూచనలు, సలహాలతో మా మంత్రి వర్గం, కార్యకర్తలు అభివృద్ధిలో భాగమవుతాం. ప్రజలు మాపై నమ్మకం పెట్టారు....ఆ నమ్మకం ఫలితమే ఇవాళ రూ.2 లక్షల కోట్లకు పైగా పనులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా ప్రధాని మోదీకి ఆ లక్ష్మీనరసింహస్వామి దీర్ఘాయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com