బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా ప్రధానమంత్రి పదవిని, దేశాన్ని వదిలిపెట్టి.. భారత్‌లోకి వచ్చి షేక్ హసీనా తలదాచుకుంటున్నారు. అయితే ఆమెపై అనేక కేసులు నమోదు చేసిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. తమ దేశానికి అప్పగించాలని భారత్‌కు మెసేజ్ పంపించింది. అయితే ఆమెను దేశంలోనే ఆశ్రయం కల్పించిన భారత్.. తాజాగా ఆమె వీసా గడువు పొడిగించింది. ఇక ఆమెను అప్పగించడం లేదని కొందరు బంగ్లాదేశ్ నేతలు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే షేక్ హసీనా పాస్‌పోర్టును బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. అయితే ఆమె వీసా గడువును మాత్రం భారత్ తాజాగా పొడిగించడం విశేషం. దీంతో ఆమెకు మరోసారి భారత్ మద్దతుగా నిలిచినట్లయింది.
ఇక షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీకి సందేశం పంపించింది. తాజాగా ఆమె పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిణామాల మధ్య తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షేక్ హాసీనా వీసా గడువును పొడిగించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియాల్లో కథనాలు వెల్లడించాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షేక్ హసీనా మరికొంత కాలం భారత్‌లో ఉండేందుకు వీలుగా ఆమె వీసా గడువును కేంద్రం పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా వచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన తర్వాత వీసా పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో షేక్ హసీనాకు శరణార్థిగా భారత్ ఆశ్రయం కల్పించనున్నారంటూ వస్తున్న వార్తలను సదరు వర్గాలు కొట్టిపారేశాయి.
16 ఏళ్లుగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కొనసాగుతుండగా.. 2024 ఆగస్ట్‌లో ఆ దేశంలో జరిగిన విద్యార్థుల రిజర్వేషన్ల ఉద్యమం కారణంగా పడిపోయింది. దీంతో ఆమె ఉన్నఫలంగా పదవిని, స్వదేశాన్ని వీడి భారత్‌కు వచ్చి ఒక రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాపై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేశాయి. ఈ క్రమంలోనే షేక్ హసీనాకు తమకు అప్పగించాలంటూ డిసెంబరులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక దౌత్య సందేశం పంపించింది. అయితే ఈ వ్యవహారంపై తాము వ్యాఖ్యానించాల్సిందేమీ లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు.