ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుగా మారిన యూపీ గ్యాంగ్‌స్టర్.. సినిమాను మించిన ఈ స్టోరీ ఎలా వెలుగులోకి వచ్చిందంటే

national |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 09:08 PM

నేరస్థులు తాము చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రాంతాలు, వేషాలు, భాషలు మార్చుకుంటూ కొత్త జీవితాలను ప్రారంభిస్తారు. ఈ విషయాల గురించి మనకు బాగానే తెలుసు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వార్త మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్.. మోస్ట్ ట్రస్టెడ్‌గా మారిపోయాడు. గ్యాంగ్‌స్టర్ నుంచి నేరుగా హోంగార్డుగా ఉద్యోగాన్ని సంపాదించాడు. సినిమా రేంజ్‌లో ట్విస్ట్ ఉన్న ఈ క్రైమ్ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర ప్రదేశ్ చక్వారాకు చెందిన చెందిన నక్దు.. జెహానాగంజ్‌కు చెందిన మున్నా యాదవ్‌ను 1984వ సంవత్సరంలో హత్య చేశాడు. ఈ ఒక్క హత్య మాత్రమే కాకుండా అనేక దొంగతనాలు, దోపిడీలకు కూడా పాల్పడ్డాడు. 1984 నుంచి 1987 వరకు అంటే మూడేళ్ల పాటు అనేక కేసుల్లో ఇరుక్కున్నాడు. ఈక్రమంలోనే 1988వ సంవత్సరంలో యూపీ పోలీసులు నక్దుపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేశారు. మోస్ట్ వాంటెడ్‌గా కూడా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి నక్దు ఎవరికీ కనిపించలేదు. అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయాడని అంతా భావించారు.


 చాలా రోజుల పాటు పోలీసుల గాలింపు చర్యలు చేపట్టినా అతడు దొరక్కపోవడంతో.. కేసును పక్కన పెట్టేశారు. కానీ నక్దు మాత్రం తాను చేసిన నేరాల నుంచి తప్పించుకోవడానికి ఓ అద్భుతమైన ప్లాన్ వేశాడు. తన పేరుతో పాటు ప్రాంతాన్ని కూడా మార్చుకున్నాడు. నక్దు పేరును తొలగించుకుని నందలాల్ యాదవ్‌గా మార్చుకున్నాడు. అలాగే అందులో తన తండ్రి పేరును కూడా మార్చాడు. లోకై యాదవ్ కొడుకుగా పెట్టుకున్నాడు. 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతడు 8వ తరగతి వరకు చదువుకున్నట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించుకున్నాడు.


ఈ ఆధారాల సాయంతోనే 1989లో హోంగార్డుగా ఉద్యోగం సంపాదించాడు. 1922లో స్థానిక పోలీసులు నందలాల్ యాదవ్ క్యారెక్టర్ సర్టిఫికేట్‌పై సంతకాలు చేయడం గమనార్హం. ఇక అప్పటి నుంచి 2024 వరకు పోలీస్ స్టేషన్‌లోనే హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు నక్దు. దాదాపు 35 సంవత్సరాలుగా పక్కనే ఉన్న ఈ గ్యాంగ్‌స్టర్‌పై.. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే గతేడాది డిసెంబర్ 3వ తేదీన నక్దు మేనల్లుడు.. తన మామ అన్యాయంగా ఉద్యోగం సంపాదించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నందలాల్ యాదవ్‌యే.. ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ నక్దు అని గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేసి అతనిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం 57 ఏళ్ల వయసు కల్గిన ఇతడు మరికొన్ని రోజుల్లోనే పదవీ విరమణ పొందనుండగా.. మేనల్లుడి చొరవతో అసలు బాగోతం బయట పడింది. దీంతో పోలీసులు అంతా షాక్ అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com