స్క్విడ్ గేమ్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఫేమస్ అయిన వెబ్‌సిరీస్‌లలో ఇదీ ఒకటి. అందులో నిర్వహించే గేమ్‌లో ఓడిపోయిన వారిని చంపేస్తూ ఉంటారు. ఈ స్క్విడ్ గేమ్‌లో గెలిచిన వారికి భారీగా డబ్బు లభిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇటీవల విడుదలైన స్క్విడ్ గేమ్ 2 బాగా పాపులర్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. స్క్విడ్ గేమ్ సిరీస్‌లో నటించే నటీనటులు వేసుకునే గ్రీన్ కలర్ డ్రెస్‌ను లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు వేసుకుని.. పార్లమెంటుకు రావడం కనిపిస్తోంది. పార్లమెంటులో ప్రసంగిస్తుండటం కూడా ఆ వీడియోలో చూడొచ్చు. ఇక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రం అందరిలా కాకుండా బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించారు.
అయితే ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ మాయ. ఏఐ ఉపయోగించి భారత రాజకీయ నాయకులకు సంబంధించి రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా సహా అనేక మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఆ వీడియోలో కనిపించారు.
ఇక గ్రీన్ సూట్‌లో వారంతా పార్లమెంట్‌కు వచ్చి.. సమావేశాల్లో పాల్గొన్నట్టుగా ఉన్న ఆ వీడియో నెటిజన్లు బాగా నచ్చుతోంది. దీంతో ఆ వీడియోకు లైక్‌లు, షేర్లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆ వీడియో చూడటానికి బాగుందంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు సభలో ప్రసంగిస్తున్నట్లు కూడా అందులో ఉంది. స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇటీవలే స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 విడుదలైన తొలి వారం రోజుల్లోనే అత్యధికంగా 68 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే స్వ్కిడ్ గేమ్ 3 ఉంటుందని సీజన్ 2 చివర్లో రివీల్ చేశారు.