ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ.210 కోట్ల కరెంట్ బిల్లు చూసి షాక్.. ఆఫీసుకు వెళ్లిన వ్యాపారికి ఏం జరిగిందంటే?

national |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 09:09 PM

ఒక్కోసారి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉంటుందో మనకు తెలిసిందే. చాలాసార్లు విద్యుత్ బిల్లుల విషయంలో వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. అయితే ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉన్న ఇంటికి కూడా రూ.లక్షల్లో కరెంట్ బిల్ వచ్చిన సంఘటనలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యాపారికి రూ.210 కోట్ల కరెంట్ బిల్ రావడంతో అతడు అవాక్కయ్యాడు. ప్రతీ నెల రూ.3 వేల లోపు మాత్రమే వచ్చే కరెంట్ బిల్ ఈసారి మాత్రం ఏకంగా రూ.210 కోట్లు రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో వెంటనే దగ్గర్లో ఉన్న కరెంట్ ఆఫీస్‌కు వెళ్లి అధికారులకు తన మొర పెట్టుకున్నాడు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి విద్యుత్ అధికారులు చెక్ చేయగా.. అది సాంకేతిక సమస్య అని తేల్చారు.


హిమాచల్ ప్రదేశ్‌లోని హామీర్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జట్టాన్ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి లలిత్ ధిమాన్‌.. స్థానికంగా దుకాణం నడిపిస్తున్నాడు. అయితే అతడి వ్యాపారానికి నెలకు దాదాపు అటూ ఇటూగా రూ.3 వేల లోపు మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేది. అయితే తాజాగా విద్యుత్ సిబ్బంది కరెంట్ బిల్ ఇచ్చి వెళ్లారు. అందులో ఉన్న బిల్లు చూసి అతడికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. ఎందుకంటే రూ.210,42,08,405 కరెంట్ బిల్లు విద్యుత్ సిబ్బంది చేతిలో పెట్టడంతో లలిత్‌ ధిమాన్‌కు షాక్ కొట్టినట్లు నిలబడిపోయాడు.


తనకు రూ.210 కోట్లు కరెంట్ బిల్ రావడం ఏంటని ఆశ్చర్యపోయాడు. అనంతరం స్థానికంగా ఉన్న విద్యుత్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విద్యుత్ బిల్లు రికార్డులను పరిశీలించిన కరెంట్ అధికారులు.. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి.. అధిక విద్యుత్ బిల్లు వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ నెలకు అతడి కరెంట్ బిల్లు రూ.210 కోట్లు కాదని.. రూ.4,047 అని కరెంట్ అధికారులు చెప్పడంతో లలిత్‌ ధిమాన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


అయితే గతంలో కూడా అనేకసార్లు విద్యుత్ అధికారుల తప్పిదాల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. గతేడాది గుజరాత్‌లోని వల్సాద్‌ ప్రాంతంలో టైలరింగ్‌ దుకాణం నడిపే అన్సారీ అనే వ్యక్తికి రూ.86 లక్షల బిల్లు వచ్చింది. దీంతో ఆయన కరెంట్ అధికారులను ఆశ్రయించగా.. అతని టైలర్ షాప్‌కు చేరుకున్న డిస్కం అధికారులు అతడి కరెంట్ మీటర్‌ను పరిశీలించి.. సాంకేతిక లోపం వల్ల మీటర్ రీడింగ్‌కు రెండు సంఖ్యలు చేరడంతో ప్రింట్‌ తప్పుగా వచ్చిందని గుర్తించి మార్చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com