రోజురోజుకూ మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోపాలు పెంచుకుంటూ.. ప్రాణంగా ప్రేమించిన వారి ప్రాణాలను తీస్తున్నారు చాలా మంది. ఇలాగే చేశాడో యువకుడు. తనను, తన ప్రేమను నమ్మి వచ్చిన ఓ యువతిని అతి కిరాతంగా హత్య చేశాడు. ఆపై ఆ నిజం ఎవరికీ తెలియొద్దని అద్దెకు ఉంటున్న ఇంట్లోని ఓ ఫ్రిజుల్లో ఆమె మృతదేహాన్ని 6 నెలలుగా దాచాడు. ఇన్నాళ్ల పాటు ఆ విషయం ఎవరికీ తెలియకుండా చాలానే ఏర్పాట్లు చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ప్రదేశ్‌లోని దేవాస్ ప్రాంతానికి చెందిన ధీరేంద్ర శ్రీవాస్తవకు అక్కడే ఓ ఇల్లు ఉంది. అయితే ఆయన దుబాయిలో ఉంటున్న కారణంగా.. ఆ ఇంటిని పలువురికి అద్దెకు ఇచ్చాడు. ముఖ్యంగా తన ఇంట్లో ఓవైపు డబుల్ బెడ్రూం పోర్షన్ ఉండగా.. మరోవైపు రెండు గదులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రెండు పోర్షన్లకు మధ్యలో మెట్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూం పోర్షన్‌ను ఓ కుటుంబానికి ఇచ్చిన ఆయన.. దాని పక్కనే ఉన్న మరో పోర్షన్‌ను మాత్రం ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్‌కు అద్దెకు ఇచ్చాడు.
అయితే సంజయ్ పాటిదార్‌కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని దాచి అతడు ప్రతిభ అనే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. నీవు లేకపోతే చచ్చిపోతానంటూ చెప్పగా.. నమ్మిన ప్రతిభ కుటుంబాన్ని వదిలి మరీ అతడి కోసం వచ్చేసింది. ఇక అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ ఇంటికి మాత్రం వారు 2023 జూన్ నెలలో వచ్చారు. అప్పుడప్పుడూ ప్రియుడు ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్తున్నట్లు చెబుతూ భార్యా, పిల్లల వద్దకు వెళ్లొచ్చేవాడు. ఇలా సంవత్సర కాలం వీరి కాపురం హాయిగానే సాగింది.
కానీ గతేడాది మేలో ప్రతిభకు సంజయ్ అసలు స్వరూపం తెలిసింది. అతడికి ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించింది. ఇక అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోమని వేధించడం ప్రారంభించింది. కానీ సంజయ్ మాత్రం ప్రతిభను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఎలాగైనా సరే ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఆమెను చంపేస్తే ఎవరికీ తెలియదని భావించి.. ఆమెకు హత్యకు ప్లాన్ చేశాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు వినోద్ దేవ్‌కు చెప్పగా అతడు కూడా సాయం చేశాడు.
ఇలా 2024 జూన్‌లో ఓ రోజు అర్ధరాత్రి ప్రతిభ గొంతు నులిమి చంపేశాడు. మృతదేహం బయట పడేస్తే విషయం తెలిసిపోతుందని.. ఇంట్లోని ఫ్రిజ్జులోనే మృతదేహం దాచాలనుకున్నాడు. స్నేహితుడి సాయంతో ప్రతిభ కాళ్లూ చేతులు కట్టేసి ఆపై ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్జులో పెట్టేశాడు. వాసన బయటకు రాకుండా.. ఎక్కువ కూలింగ్ పెట్టాడు. ఆ తర్వాత ఇంటి యజమానికి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు వివరించాడు. అయితే అన్ని సామాన్లను ఒక్కసారే తీసుకెళ్లలేనని.. కొన్ని ఇక్కడే ఉంచుకుంటానని తెలిపాడు. అందుకు నెల నెలా అద్దె కూడా చెల్లిస్తానని చెప్పగా యజమాని ఓకే చెప్పాడు.
ఆ తర్వాత అప్పుడప్పుడూ ఆ ఇంటికి వచ్చిన సంజయ్.. కొన్ని కొన్ని సామాన్లను తీసుకువెళ్లేవాడు. కానీ ఇంటి అద్దె మాత్రం చెల్లించడం మానేశాడు. ఎన్నిసార్లు అడిగినా అతడు చప్పుడు చేయకపోవడంతో.. మరో పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వ్యక్తికి యజమాని ఫోన్ చేశాడు. ఆ తలుపులు పగులగొట్టి సామాన్లు బయట పడేయమని వివరించాడు. దీంతో అతడు.. గది తలుపులు పగులగొట్టి పలు సామాన్లను పడేశాడు. అప్పుడే ఫ్రిజ్జు ఆన్‌లో ఉండడం చూసిన ఆయన కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని దాన్ని ఆఫ్ చేశాడు. రేపొచ్చి ఇంటిని శుభ్రం చేయాలనుకుని తన ఇంటికి వెళ్లిపోయాడు.
అయితే మరుసటి రోజు ఆ గది నుంచి దుర్వాసన రావడంతో.. వెంటనే అతడు అక్కడకు వెళ్లాడు. వాసన ఫ్రిజ్జులోంచి వస్తుందని గమనించి.. దాన్ని తెరిచాడు. అందులో ఉన్న మృతదేహం చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై యజమానికి కూడా విషయం తెలిపాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్న సంజయ్‌ను కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే అతడు తానే ప్రియురాలిని చంపినట్లు అంగీకరించాడు. అయితే ఇతడికి సాయం చేసిన వినోద్‌ను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.