అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక మైలు రాళ్లను చేరుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేసి చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఐదేళ్ల పాలనతో పోలుస్తూ తాము చేసిన పనుల వివరాలను తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.ఎన్డీయే ప్రభుత్వంలో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొన్ని మైలురాళ్లు సాధించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద వైసీపీ ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మిస్తే ఎన్డీయే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 3,750 కి.మీ. సీసీ రోడ్లు వేసినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మినీ గోకులాలు కేవలం 268 ఏర్పాటు చేస్తే, తాజాగా ఆరు నెలల్లోనే 22,500 నిర్మించినట్లు వెల్లడించారు. పీవీటీజీ ఆవాసాల కోసం వైసీపీ రూ.91 కోట్లు ఖర్చు చేస్తే, తాము కేవలం ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.