విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ.11,500 కోట్ల భారీ ప్యాకేజి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విశాఖపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ... కొత్త ఏడాదిలో కేంద్రం నుంచి అన్నీ మంచి వార్తలే వస్తున్నాయని వెల్లడించారు. నగరాభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని, ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం రూ.11,500 కోట్లు కేటాయిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంలో విజయం సాధించామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వద్దంటూ గతంలో రాజీనామా కూడా చేశానని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనతో రాష్ట్రం తీవ్రంగా అప్పులపాలైందని, చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని వ్యాఖ్యానించారు.