ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పోడుస్తున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కక్షపెట్టుకున్నారని, అందుకే రోజూ అసత్యాలతో బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు విధ్వంసం చేసిన జగన్.. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. అలాంటి పరిస్థితుల నుంచి సీఎం చంద్రబాబు తన అనుభవంతో ఆ వ్యవస్థను సరిదిద్దారని చెప్పారు. ఇదే ఆయన అనుభవానికి నిదర్శమని గొట్టిపాటి చెప్పుకొచ్చారు.ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేకపోవడం వల్లే జగన్ అసత్యాల ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ఈ పథకాల ప్రయోజనాలేంటో దీర్ఘకాలంలో ప్రజలు తెలుసుకుంటారని మంత్రి చెప్పారు. ఎలాంటి అదనపు భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే ఈ పథకాల వల్ల నష్టమేంటో జగన్ మోహన్ రెడ్డి చెప్పాలంటూ మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు.