జమ్మూ కాశ్మీర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు. వరదరాజులు, సెల్వి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ (29) డిగ్రీ చదువుకుంటూ ఆర్మీలో 2017 లో చేరారు. దీపావళీ పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లాడు. ఇంతలో ఈ వార్త ఆయన కుటుంబంలో విషాదం నింపింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్తీక్ మృతితో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.