మీరు తరచూ వివాదాల్లో చిక్కుకొంటున్నారు. మిమ్మల్ని ఇప్పటికే రెండుసార్లు మా ముందుకు పిలవాల్సి వచ్చింది. మీ వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి కూడా అసంతృప్తితో ఉన్నారు. మీరు గీత దాటుతున్నారు....జాగ్రత్త’’ అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. క్రమ శిక్షణ సంఘం సభ్యులు వర్ల రామయ్య, ఎంఎ షరీఫ్, కొనకళ్ల నారాయణ, బీసీ జనార్దనరెడ్డి, పంచుమర్తి అనురాధ ఈ విచారణలో పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ నెల పదకొండో తేదీన ఒక రోడ్డు వివాదంలో ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే చేయి చేసుకొన్నారని, ఆ రోడ్డుపై ఉన్న కంచెను పీకివేశారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆ వ్యక్తి భార్య పురుగులమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరుపై అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశంతో పార్టీ క్రమ శిక్షణ సంఘం కొలికపూడిని తమ ముందుకు పిలిచింది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం, తాను ఏ తప్పూ చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు వాదించారు. ఆ మహిళ అసలు పురుగుల మందు తాగలేదని చెప్పారు. దీంతో క్రమశిక్షణ సంఘం సభ్యునిగా ఉన్న వర్ల రామయ్య అప్పటికప్పుడు పోలీసు అధికారులకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకొన్నారు. ఆ మహిళ పురుగులమందు తాగిన విషయం వాస్తవమేనని, కానీ తక్కువ పరిమాణంలో తాగడంతో ప్రమాదం నుంచి బయటపడిందని పోలీసు అధికారులు చెప్పారు. తాను న్యాయంగానే వ్యవహరించానని, ఏ తప్పూ చేయలేదని పేర్కొంటూ ఎమ్మెల్యే కొన్ని రుజువులు ఈ సంఘానికి అందచేశారు. తన వాదనను వివరిస్తూ ఒక లేఖను కూడా ఆయన సమర్పించారు. క్రమశిక్షణ సంఘం ఈ ఒక్క అంశానికే పరిమితం కాకుండా ఎమ్మెల్యే తరచూ వివాదాల్లో చిక్కుకుంటుండడాన్ని ప్రస్తావించింది. ‘‘మీరు బాధ్యత కలిగిన ఎమ్మెల్యే. తరచూ మిమ్మల్ని ఏదో ఒక వివాదం చుట్టుముడుతోంది. ఇది మీకూ... పార్టీకీ మంచిది కాదు. సామాజిక వర్గాల అంశాలను బహిరంగంగా ప్రస్తావించి విమర్శలు చేయడం... చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేలా ప్రవర్తించడం సరికాదు. మీ తీరు బాగోలేకపోవడం వల్లే క్రమశిక్షణ సంఘం ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితిని పదేపదే తెచ్చుకోవద్దు. గీత దాటవద్దు. క్రమశిక్షణ పాటించండి. అందరినీ కలుపుకొని పోండి. వివాదాల వల్ల మంచి పేరు రాదు. పనితీరు వల్ల వస్తుంది. ఈ విషయం గుర్తించండి’ అని సంఘం సభ్యులు ఆయనకు గట్టిగా చెప్పినట్లు సమాచారం.