పశుపోషణ రైతుల ఆర్థికాభ్యున్నతికి దోహదం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో పశు వైద్య శిబిరాన్ని, అవగాహన సదస్సును మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిపి అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పశువుల ఆరోగ్య సంరక్షణ ఉత్పాదకాలు పెంచడానికి, వ్యాధులు నియంత్రించడానికి ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకుని, వ్యవసాయ, ఉద్యానశాఖల్లో వృద్ధి రేటు మరింత పెంచడంపై దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖలపై ఆయన సమీక్ష చేశారు. ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.