విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మరికొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఈవో గుర్తించినట్లు సమాచారం. డిసెంబరు 31న దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న కె.రామచంద్రమోహన్.. ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి ఆయన ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించారు.నిబంధనల ప్రకారం దుర్గగుడిలో భక్తులకు కావాల్సిన వసతులు, ఏర్పాట్లు చేయట్లేదని, కొందరు ఉద్యోగులు విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మరికొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఈవో గుర్తించారు. పాలనను గాడిలో పెట్టేందుకు ఆయన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో వేర్వేరుగా సోమవారం సమావేశాలు నిర్వహించారు. తాను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగులు నిబంధనల మేరకు విధులు నిర్వహించి, భక్తులకు కనీస వసతులు కల్పించాలని, దేవస్థానం ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవటంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాటి సమావేశంలో ఆయన ఉద్యోగుల వివరాలు, ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు, వారిలో ఎన్‌ఎంఆర్‌లు, కాంట్రాక్టు సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, పర్మినెంట్ ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరై బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.. వంటి అంశాలపై ఆరా తీశారు. కొన్ని విభాగాల ఉద్యోగులు బయోమెట్రిక్ నమోదు చేయటం లేదని, కొందరు విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసి ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అధికారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఓ విభాగం అధికారులు కనీసం ముఖ్యమైన అంశాలను కూడా తన దృష్టికి తీసుకురావట్లేదని ఈవో ప్రశ్నించగా, సదరు అధికారులు మౌనంగా ఉండిపోయారు. అలాగే, దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు కూడా ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. రాష్ట్రంలో ఏ దేవస్థానంలో లేనివిధంగా దుర్గగుడిలో ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని, కనీసం భక్తులకు కల్పించాల్సిన వసతులు కూడా లేవని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగులందరూ సక్రమంగా విధులు నిర్వహించి దేవస్థాన పవిత్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు.