అన్న క్యాంటీన్‌లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, క్యాంటీన్ల నిర్వహణ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నది. ఇందుకోసం ఆయా క్యాంటీన్ల వద్ద క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి, భోజనం చేయడానికి వచ్చే వారి అభిప్రాయాలను కోరుతున్నది.పట్టణ ప్రాంతాల్లో నిరుపేద కార్మికులు, దినసరి కూలీల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్’లను నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇక్కడ ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం/ మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారు. భోజన సరఫరా బాధ్యతను స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అయితే అల్పాహారం, భోజనం నాణ్యతపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించింది. డిజిటల్ లావాదేవీల తరహాలో క్యూ ఆర్ కోడ్‌ను అమల్లోకి తెచ్చింది. ఎలమంచిలిలోని కొమ్మాయిగుండం వద్ద నిర్వహిస్తున్న క్యాంటీన్ లోపల, బయట గోడలపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ భోజన చేయడానికి వచ్చిన వారు.. తమ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ‘ఈ క్యాంటీన్‌ను సకాలంలో తెరుస్తున్నారా? ఆహార పదార్థాలు నాణ్యతగా ఉంటున్నాయా? పరిశుభ్రతను పాటిస్తున్నారా? అని మూడు ప్రశ్నలు వస్తాయి. వీటికి అవును/ లేదు అని అప్షన్ వున్నచోట ఏదో ఒకదానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈసందర్భంగా మునిసిపల్ కమిషనర్ బీజేఎస్‌పీ రాజు మాట్లాడుతూ, అన్న క్యాంటీన్‌లో ఆహార పదార్థాల నాణ్యత, క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజల నుంచి తెలుసుకునేందుకు ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనిద్వారా వచ్చే సమాచారాన్నిబట్టి క్యాంటీన్‌ను మరింత సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు.