చింతపల్లి మండలంలోని చౌడుపల్లి పంచాయతీ వాముగెడ్డ గ్రామంలో 20 రోజుల వ్యవధిలో ముగ్గురు శిశువులు మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానికులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ దృష్టికి తీసుకువెళ్లడంతో సోమవారం వైద్యాధికారుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది. బాధిత కుటుంబాలతో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడి వివరాలు సేకరించారు.వాముగెడ్డ గ్రామంలో లోచల రాజేశ్, హేమలత దంపతుల మూడు నెలల శిశువు పాలు తాగకుండా ఏడుస్తుండడంతో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి కేజీహెచ్‌కి తరలించారు. కేజీహెచ్‌లో శిశువు చికిత్స పొందుతూ ఈ నెల రెండవ తేదీన మరణించింది. అలాగే పొత్తూరు రాజుబాబు, కృష్ణవేణి దంపతుల మూడున్నర నెలల శిశువు పాలు తాగకుండా ఏడుస్తూ ఈ నెల 16వ తేదీన గ్రామంలోనే మరణించింది. సాగిన రాజుబాబు, చెల్లయమ్మ దంపతుల మూడు నెలల శిశువు ఏడుస్తూ పాలు తాగకపోవడంతో కుటుంబ సభ్యులు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి కేజీహెచ్‌కి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ శిశువు ఈ నెల 19న మరణించింది. గ్రామంలో వరుసగా మూడు నెలల వయసు గల శిశువులు మరణించడంతో ఆందోళన చెందుతున్న గిరిజనులు ఈ విషయాన్ని ఐటీడీఏ పీవోకి తెలియజేశారు. దీంతో ఐటీడీఏ పీవో వెంటనే గ్రామాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణారావు, జర్రెల వైద్యాధికారి మణిదీప్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు గ్రామాన్ని సోమవారం సందర్శించిన డీసీహెచ్‌ఎస్.. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముగ్గురు శిశువులు తీవ్ర స్థాయిలో ఏడుస్తూ అస్వస్థతకు గురయ్యారన్నారు. శిశువుల మరణాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. శిశువులకు ఏఎన్‌ఎం అందించిన ఇమ్యూనైజేషన్ రికార్డు, శిశువులకు అందించిన చికిత్స కేస్‌షీట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. గ్రామస్థులు ఉపయోగిస్తున్న చేతిపంపులు, ఊటగెడ్డ నుంచి నీళ్ల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామన్నారు. గ్రామంలో చిన్నపిల్లల వైద్యనిపుణులతో రెండు రోజుల పాటు ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పిడియాట్రిక్స్‌తో కూడా శిశు మరణాలపై అధ్యయనం చేయిస్తామన్నారు. శిశువుల మరణాలపై క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో శిశు మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వాముగెడ్డ గ్రామాన్ని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీపీ కోరాబు అనుషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలతలు సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.