తమ పొలంలోని ఎద్దులు, గొర్రెలను మేపేందుకు వెళ్లి పక్కనే ఉన్న నీటి కుంటలో దిగి అక్క, తమ్ముడు మృతి చెందారు. ఈ ఘటన కోసిగి మండలం, జంపాపురంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కురువ నరసింహులు, పద్మావతి దంపతుల పిల్లలు నరసమ్మ (12) ఎనిమిదో తరగతి, రఘునందన్ 5వ తరగతి చదువుతున్నారు. నరసమ్మ ఎమ్మిగనూరులోని జడ్పీ బాలికల పాఠశాలలో చదువుతోంది. రఘునందన్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత సోమవారం పాఠశాలలు తెరిచినా.. వీరు బడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి తల్లిదం డ్రులకు సాయంగా గొర్రెలు మేపేందుకు వెళ్లారు. వారి పొలం పక్కనే ఉన్న వంకలోని నీటి కుంట వద్ద పెద్దనాన్న కుమారుడు వంశీతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నీరు తాగేందుకు కుంటలోకి దిగారు. ఈత రాకపోవడంతో బురదలో ఇరుక్కుపోయి ఊపిరాడక మునిగిపోయారు. గట్టుపై ఉన్న వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పెద్దఎత్తున తల్లిదండ్రులు, గ్రామస్థులు వెతికారు. అప్పటికే అక్క, తమ్ముడు మృతి చెందారు. ఎస్‌ఐ చంద్రమోహన్ చేరుకున్నారు. పెద్ద నరసింహులు, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వారిలో కూతురు, చిన్నకొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీంతో జంపాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.