వంశధార కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అంది.. రెండో పంట పండించుకోవచ్చనుకున్న రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. ఖరీఫ్ పూర్తికాగానే వంశధార అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పలు గ్రామ సభలు, సమావేశాల్లో ఈ ఏడాది రబీ సాగుకు వంశధార నీరు అందించలేమని ప్రకటించారు. అయితే గత రెండు నెలల్లో ఏర్పడిన అల్పపీడనాలు, పెంగల్ తుఫాన్ ప్రభావంతో పరిస్థితులు అనుకూలించడంతో సుమారు 20 గ్రామాల్లో రైతులు రెండో పంట కింద వరిసాగు చేపట్టారు. వర్షాలతో అనుకూల వాతావరణం కనిపించడంతో వంశధార అధికారులు కూడా కుడి ప్రధాన కాలువ ద్వారా కొంతమేర నీరు విడుదల చేయడంతో రైతులు ఆశాభావంగా పంటపై దృష్టసారించారు. ప్రస్తుతం హిరమండలం వద్ద వంశధార జలాశయంలో నీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కుడి ప్రధాన కాలువ నీరు లేక వెలవెలబోతుంది. దీంతో చివరి దశలో ఉన్న వరి మొనలు ఎండిపోవడమే కాకుండా పొలాలు కూడా పగళ్లు దేరిపోతున్నాయి. ఎల్‌ఎన్ పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లో వరి పంట సాగు చేస్తున్నారు.ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగుజేసుకోవాలని కొండవలస గ్రామ సర్పంచ్ లావేటి విశ్వేశ్వరరావుతో పాటు కొంతమంది రైతులు కోరతున్నారు. వంశధార జలాశయం మాట ఎలా ఉన్నప్పటికీ గొట్టా బ్యారేజి నీటిలో కొద్దిపాటి నీటిని వంశధార కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తే రైతులు పూర్తిస్థాయిలో నష్టపోకుండా కొంతమేర ఉపశమనం పొందవచ్చునని వారంతా కోరుతున్నారు.