అరసవల్లిలో అంబరాన్ని తాకేలా రథసప్తమి సంబరాలను నిర్వహించాలని శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కార్యక్రమాల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ‘మూడు రోజులపాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. తొలిరోజు 80 అడుగుల రోడ్డులో ఉదయం 7గంటలకు సామూహిక సూర్యనమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం మున్సిపల్ మైదానంలో వాలీబాల్, కర్రసాము, సంగిడీలు, ఎడ్ల బండ్ల పోటీలు, వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తాం. కలెక్టరేట్ సమీపాన డచ్ బిల్డింగ్ వద్ద హెలీకాప్టర్ టూరిజం ఏర్పాటు చేస్తాం. 80 అడుగుల రోడ్డులో వివిధ రకాల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. ఏడురోడ్ల కూడలి నుంచి అరసవల్లి ఆలయం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తాం. 80 అడుగుల రోడ్డులో సాయంత్రం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి లేజర్ షో, డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్స్ షో ఉంటాయి. మూడు రోజులపాటు ఆదిత్యాలయంలో సూర్యయాగం జరుగుతుంది. ఆలయం వద్ద వివిధ దేవాలయాల మోడళ్లను ప్రదర్శిస్తాం. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల’ని తెలిపారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, జిల్లా పర్యాటక శాఖాధికారి కె.నారాయణరావు, డీఎస్పీ వివేకానంద, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, అగ్నిమాపక అధికారి మోహన్‌రావు, డీపీవో కె.భారతి సౌజన్య, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.