ఉద్యోగ భద్రత కల్పించాలని, 2019 పీఆర్సీ అమలు చేయాలని, 62 ఏళ్ల పదవీ విరమణ వర్తించేలా జీవో ఇవ్వాలని కోరుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (ఏఏసీఎస్) ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ.. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, జీవో 36 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలను ఇన్‌కమ్ టాక్స్ పరిధిలో నుంచి తప్పించాలని, గ్రాట్యూటీని రూ.2లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆదినారాయణమూర్తి, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రంగనాథ్, జిల్లా అధ్యక్షుడు లోలుగు మోహనరావు, ప్రధాన కార్యదర్శి బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.