ప్రకృతిని సంస్కృతిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి ద్వారా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సూళ్లూరుపేట కళాశాల మైదానంలో సోమవారం జరిగిన మూడు రోజుల పక్షుల పండుగ ముగింపు సభలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వం పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగానే నాలుగేళ్లుగా నిలిచిపోయిన పక్షుల పండుగను మళ్లీ నిర్వహించామని తెలిపారు. ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ వలసపక్షుల విన్యాసాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయన్నారు. అందుకే 2001లో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వం పక్షుల పండుగను ప్రారంభించిందని గుర్తుచేశారు. వైసీపీ నిలిపేసిన ఈ పండుగను తమ ప్రభుత్వం వచ్చిరాగానే తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. సీఎం సూచనల మేరకు ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించామన్నారు.