సంక్రాంతి పండగ సందర్భంగా మాట్లాడిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి.. గోమూత్రం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. గోమూత్రానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని.. అందులో ఔషద గుణాలు ఉన్నాయంటూ వి.కామకోటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారి తీశాయి. అయితే ఈ విషయాన్ని తనకు స్వయంగా గోమూత్రం సేవించి దాని ద్వారా ఫలితాలు పొందిన ఒక సాధువు చెప్పినట్లు వి.కామకోటి చెప్పడం గమనార్హం. అయితే ఉన్నత విద్యను అభ్యసించిన వి.కామకోటి.. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ పదవిలో ఉండి.. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేస్తారా అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అనేక మంది తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే తాను చెప్పిన దాంట్లో ఎలాంటి అసత్యాలు లేవని ఆయన సమర్థించుకోవడం గమనార్హం.
ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో నిర్వహించిన గోపూజలో వి.కామకోటి పాల్గొని మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. గోమూత్రం అద్భుతమైన ఔషధ విలువలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గోమూత్రంలో ఉన్న ఔషధ విలువలను ఆయన ప్రశంసించారు. తీవ్ర జ్వరం వచ్చినప్పుడు గోమూత్రం సేవించిన ఒక సన్యాసి తనకు ఈ విషయం చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అతనికి ఒకసారి తీవ్ర జ్వరం వచ్చిందని.. వెంటనే గోమూత్రాన్ని తీసుకువచ్చి తాగించిన 15 నిమిషాల్లోనే ఫలితం కనిపించిందని వెల్లడించారు. చూస్తుండగానే ఆయన తీవ్ర జ్వరం నుంచి కోలుకున్నాడని పేర్కొన్నారు. ఆ సాధువు పేరు తాను మర్చిపోయానని వి.కామకోటి తెలిపారు. గోమూత్రం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ అని వెల్లడించారు. కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలకు గోమూత్రం మంచి ఔషధమని పేర్కొన్న వి.కామకోటి.. దాని ఔషధ విలువను తెలుసుకోవాలని పేర్కొన్నారు.
అయితే వి.కామకోటి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై డీఎంకే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వి.కామకోటి చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను విద్యా వ్యవస్థ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ నుంచి.. బదిలీ చేసి మెడికల్ కాలేజీల్లో నియమించాలని పేర్కొన్నారు. ఐఐటీ అనేది ఇంజనీరింగ్, ఇతర రంగాలకు సంబంధించిందని.. అందుకే కేంద్రం వెంటనే అతన్ని ఐఐటీ నుంచి తొలగించి.. ఎయిమ్స్‌లో డైరెక్టర్‌గా నియమించాలని ఎద్దేవా చేశారు. చెన్నైలో కాకుండా.. ఉత్తర్‌ప్రదేశ్, లేదా మరెక్కడైనా వారు ప్రజలను నమ్మించే చోట వి.కామకోటిని నియమించాలని.. అక్కడ వారు ప్రజలను మోసం చేయవచ్చని.. గోమూత్రం గురించి అబద్ధాలు చెప్పవచ్చని ఇలంగోవన్ పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత కార్తీ చిదరంబరం కూడా తీవ్రంగా ఖండించారు. ఐఐటీ-మద్రాస్ డైరెక్టర్ నకిలీ శాస్త్రాన్ని ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు.
మరోవైపు.. వి. కామకోటి గోమూత్రం గురించి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మద్దతుగా నిలిచింది. గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, డీఎంకేలపై మండిపడింది. గోమూత్రం అనేది భారతీయ సాంప్రదాయ వైద్యం అని.. మనం మందులు కొనే చాలా దుకాణాల్లో కూడా గోమూత్రం కలిపి ఇస్తారని కాషాయ పార్టీ వెల్లడించింది. గోమూత్రం ఔషదం అని కొందరి నమ్మకం అని.. ఎవరైనా నమ్మకపోతే వదిలేయండి అని బీజేపీ నేత నారాయణ్ తిరుపతి హితవు పలికారు. ఐఐటీ డైరెక్టర్ లాంటి వ్యక్తి మేధావి అని.. నిజాయితీపరుడు అని.. ఉన్నత విద్యను చదివిన వ్యక్తి గురించి మీరు మాట్లాడలేరని పేర్కొన్నారు.