ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందంగా ఉండటమే ఆమె తప్పా.. వైరల్‌ గర్ల్‌ మోనాలీసాకు అవస్థలు.. బతకనివ్వర్రా

national |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2025, 08:22 PM

ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. ఇలాంటి "అతి" గాళ్లు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతీ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. లైక్‌లు, షేర్లు, సబ్‌స్క్రైబ్‌లు, కామెంట్ల కోసం.. ఎలాంటి పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రమాదరకర స్టంట్లు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్‌తో ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతుండగా.. మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తమవైపు చూసేలా చేసింది.. మోనాలిసా.


ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఈనెల 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజులపాటు సాగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇటీవల సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి.. మహా కుంభమేళాలో తళుక్కున మెరిసింది.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టినీ ఆకర్షించింది. పిల్లి కళ్లు, డస్కీ స్కిన్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు.


మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం.. ఆ తర్వాత ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు, అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నింటినీ తట్టుకోలేక పోయింది.


ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. మోనాలిసా వెంటే వెళ్లి మైక్‌లు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే.. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం అవుతోంది. ఇక ఇలా జరుగుతుండటంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.


మహా కుంభమేళా సందర్భంగా బ‌తుకుదెరువు కోసం మ‌ధ్యప్రదేశ్ నుంచి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే.. తమను పనిచేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి.. ఆమెను తమ స్వస్థలం అయిన ఇండోర్‌కు పంపించేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com