ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీపై పాల వ్యాపారి కేసు.. 250 రూపాయల నష్టానికి కారణం అతడేనంటూ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2025, 08:29 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై తాజాగా బిహార్‌కు చెందిన ఓ పాల వ్యాపారి కేసు పెట్టారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యల వల్ల తాను 250 రూపాయలు నష్ట పోవాల్సి వచ్చిందంటూ.. స్థానిక కోర్టును ఆశ్రయించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. త్వరలోనే వీటిపై రాహుల్ గాంధీని విచారించాలంటూ తన పిటిషన్‌లో కోరారు. ఆ పూర్తి వివరాలు ఏంటి, అసలు పాల వ్యాపారి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వల్ల 250 రూపాయలు ఎలా నష్టపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కాంగ్రెస్ అగ్రనాయకుడు అయిన రాహుల్ గాంధీ ఇటీవలే.. ఢిల్లీ కోటా రోడ్డులో ఏర్పాటైన కాంగ్రెస్ కొత్త కార్యాలయానికి వెళ్లారు. అక్కడే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రెండూ కలిసి ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయంటూ ఆరోపించారు. తాము ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్‌తో కూడా పోరాడుతున్నామంటూ వ్యాఖ్యానించారు.


బిహార్‌లోని సమిష్టిపూర్‌కు చెందిన పాల వ్యాపారి ముకేశ్ చౌదిరి.. రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్లను టీవీ ద్వారా విన్నారట. ఈక్రమంలోనే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని.. సరిగ్గా అప్పుడే తన చేతిలో ఉన్న పాల బకెట్ జారి కింద పడిపోయిందని చెప్పుకొచ్చారు. బకెట్ జారిపోవడంతో అందులో ఉన్న 5 లీటర్ల పాలు నేల పాలు అయ్యయాని ముకేశ్ చౌదరి వెల్లడించారు. ఒక లీటర్ పాల ధర రూ.50 ఉండగా.. ఈ ఐదు లీటర్ల పాల ధర రూ.250 అవుతుందని.. రాహుల్ చేసిన వ్యాఖ్యల వల్లే తాను 250 రూపాయలను నష్టపోయానంటూ పేర్కొన్నారు.


ముఖ్యంగా దీనిపై స్థానికంగా ఉన్న రోసెరా సబ్ డివిజన్‌లోని సివిలో కోర్టును ఆశ్రయించారు. తాను 250 రూపాయలు నష్టపోవడానికి కారణం అయిన రాహుల్ గాంధీని విచారించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా దేశ ద్రోహానికి సంబంధించిన సెక్షన్ 152 సహా వివిధ BNS సెక్షన్ల కింద ఫిర్యాదు చేశారు. అయితే పాల వ్యాపారి ముకేశ్ చౌదరి వేసిన ఈ వ్యాజ్యాన్ని ఆ కోర్టు అంగీకరించిందో లేదో ఇంకా తెలియదు. కానీ 250 రూపాయల కోసం రాహుల్ గాంధీపై కేసు పెట్టడంతో.. వార్త వైరల్‌గా మారింది.


రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికీ దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇటీవలే అసోం రాష్ట్రంలోని గౌహతి పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై అదే ప్రాంతానికి చెందిన మోంజిత్ చెటియా ఫిర్యాదు చేశాడు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల దేశ వ్యాప్తంగా శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లుతుందంటూ ఫిర్యాదులో వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com