గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది ట్రంప్‌నకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అయితే భారత దేశానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి మాత్రం.. అరుదైన బహుమతిని అతడికి అందించేందుకు సిద్ధం అయ్యారు. ఏకంగా వజ్రంపైనే ట్రంప్ ముఖాన్ని చెక్కి.. ఆయనకు పంపబోతున్నారు. అయితే ఈ డైమండ్ ఎంత బరువు ఉంటుంది, దాని విలువ ఎంత అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ సంస్థ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఓ అద్భుతమైన బహుమతిని తయారు చేసింది. ముఖ్యంగా మూడు నెలల కష్టపడి మరీ 4.5 క్యారెట్ల వజ్రంపై ట్రంప్ ముఖాన్ని చెక్కింది. దీని విలుల రూ.8,50,000 వరకు ఉంటుందని అంచనా. కృత్రిమంగా ఈ వజ్రాన్ని తయారు చేయడానికి దాదాపు 90 రోజుల సమయం పట్టగా.. వజ్రాన్ని పెంచడం, కత్తిరించడం, పాలిష్ చేయడం వంటి ఎన్నో పనులను చేశామని తయారీదారులు వివరిస్తున్నారు.
ముఖ్యంగా సూరత్‌కు చెందిన ఐదుగురు అనుభవజ్ఞులైన నగర వ్యాపారులు ఈ వజ్రంపై డొనాల్డ్ ట్రంప్ ముఖాన్ని చెక్కినట్లు ఆ సంస్థ యజమాని స్మిత్ పటేల్ వెల్లడించారు. అలాగే దీన్ని అమెరికా నూతన అధ్యక్షుడిగా బహుమతిగా అందజేస్తామని కూడా వివరించారు. సూరత్ ప్రపంచ వ్యాప్తంగా డైమండ్ కటింగ్ మరియు పాలిషింగ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. అయితే ప్రయోగ శాలల్లో పెంచిన వజ్రాలకు కూడా డిమాండ్ ఎక్కువ కావడంతో.. సూరత్‌లో వజ్రాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం పెద్ద ఎత్తునే చర్యలు చేపట్టింది.
ఈక్రమంలోనే సూరత్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. అక్కడే ప్రధాని మోదీకి గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ సంస్థ యజమాని స్మిత్ పటేల్ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అయితే గతంలో మోదీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్, జిల్ బైడెన్‌లకు బహుమతిగా ఇచ్చిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని కూడా ఈ కంపెనీయే తయారు చేసింది. అయితే తాజాగా ట్రంప్ ముఖాకృతిలో మరో వజ్రాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సంస్థ. మరి భారత్ వ్యాపారులు పంపిన ఈ బహుమతిలై డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.