దావోస్ లో రెండో రోజు పర్యటన సందర్భంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ పెద్ద సంఖ్యలో సమావేశాలు, సదస్సులకు హాజరయ్యారు. దావోస్ బెల్వడేర్ లో 'కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం ( AI for Good – Shaping a Smarter, Sustainable Tomorrow)' అనే అంశంపై ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి సంధాన కర్తగా ఎన్డీటీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విష్ణు సోం సంధానకర్తగా వ్యవహరించగా, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ రెవెన్యూ ప్రెసిడెంట్ మాట్ రెన్నర్, బిల్ మిలిందా గేట్స్ డైరక్టర్, ప్రోగ్రామ్ అడ్వకసీ అర్చనా వ్యాస్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ డేనియల్ సస్ కైండ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ... నేటి అధునాతన సాంకేతిక యుగంలో సులభతరమైన పాలనా విధానాల అమలు కోసం ఏఐని వినియోగించేందుకు ప్రపంచదేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని వివరించారు. ఈ ఏడాది గ్లోబల్ ఏఐ మార్కెట్ 243 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని, ఇది 2030 నాటికి ప్రతిఏటా 27.67 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం సుపరిపాలన, సామాజికాభివృద్ధికి ఏఐ, డీప్ టెక్ వంటి అధునాతన సాంకేతికత వినియోగంలో ముందంజలో ఉందని లోకేశ్ వెల్లడించారు. "ఏపీ పాలనా వ్యవస్థలో ఏఐ వినియోగానికి మేం గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నాం. దీనిద్వారా సులభతరమైన పౌర సేవల డెలివరీతోపాటు పాలనా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గ్లోబల్ వైబ్రన్సీ ఇండెక్స్ లో 4వ స్థానంలో ఉన్న భారతదేశ ఏఐ మార్కెట్ ఈ ఏడాది 27.86 శాతం వృద్ధితో 8.3 బిలియన్ డాలర్లకు చేరుకోబోతోంది. భారత్ లో బలమైన పరిశోధన, అభివృద్ధి, లీడర్ షిప్ ద్వారా శక్తివంతమైన ఏఐ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటవుతోంది. భారత బడ్జెట్ లో ఏఐ మిషన్ కోసం రూ.10,354 కోట్లు కేటాయించడం ఏఐలో అగ్రగామిగా ఎదిగేందుకు భారతదేశ నిబద్ధతను సూచిస్తోంది.సర్వీస్ నౌ, పియర్సన్ సంయుక్త అధ్యయనం ప్రకారం 2028 నాటికి భారతదేశంలో ఏఐ రంగం 2.73 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేసిందిఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషిచేస్తున్నాం. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నాం. ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్యంతో వాస్తవ-ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఏఐ వినియోగం విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది" అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.