77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు విదేశీ నేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యం ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవొ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారత అతి ముఖ్యమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో ఇండోనేషియా కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబరు 2024లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పర్యటనకు వస్తుండటం ఇదే మొదటిసారి. కర్తవ్యపథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌తో భారత త్రివిధ దళాలతో కలిసి ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల బ్యాండ్ కంటింజెంట్ కూడా పాల్గొననుంది.
ఇక, గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్‌ను రక్షణ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించనున్నారు. జాతీయగీతాలాపన అనంతరం భారత రాజ్యాంగ 75వ వార్షిక అధికారిక లోగోతో పాటు బెలూన్లను విడుదల చేస్తారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధవీరుల స్మారకం వద్ద నివాళులర్పిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెరిమోనిల్ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకోని గౌరవ వందనం స్వీకరిస్తారు. సాయుధ బలగాలు, పారా మిలటరీ దళాలు, ఆర్టిలరీ సివిల్ ఫోర్సెస్, ఎన్‌సీసీ, ఎన్‌సీసీ యూనిట్లతో మార్చ్‌ఫాస్ట్ నిర్వహిస్తారు.
కాగా, విశిష్ట అతిథులుగా వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మందిని ఆహ్వానించారు. వీరిలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ప్రకృతి వైపరీత్య నిరోధక వర్కర్లు, చేనేత, హస్తకళల కళాకారులు, పారా ఒలింపియన్లు, గిరిజనులు సహా తదితరుల ఉన్నారు. స్వర్ణ భారత్ నిర్మాతలుగా సమాజానికి విశేష సేవలందిస్తున్న వీరిని రిపబ్లిక్ డే వేడుకలకు అతిథులుగా ఎంపిక చేశారు. ‘స్వర్ణీం భారత్: విరాసత్ ఔర్ వికాస్’ అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలను నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయి నేపథ్యంలో రెండు ప్రత్యేక శకటాలు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయి.
జనవరి 26న ఉదయం 10.30 గంటలకు రిపబ్లిక్ డే పరేడ్ మొదలవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 45 నృత్యరీతులను 5000 మందికి పైగా కళాకారులు ప్రదర్శించనున్నారు. జనవరి 26 నుచి 31 వరకూ భారత్ పర్వ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. జనవరి 29న విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీడ్‌తో రిపబ్లిక్ డే వేడుకలు ముగుస్తాయి. ఇప్పటికే పరేడ్‌ను వీక్షించేందుకు టిక్కెట్ల ముందస్తు విక్రయాలు మొదలయ్యాయి. వీటిని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.