ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా హెచ్-1బీ వీసాలను కొనసాగిస్తుందా? తొలగిస్తుందా?.. ట్రంప్ ఏమంటున్నారంటే?

international |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2025, 10:47 PM

హెచ్1బీ వీసాలు అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయంటూ చాలా కాలంగా ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే హెచ్1బీ వీసాలు పొందేందుకు షార్ట్‌కట్‌గా భావించే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఓపీటీ)ని రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తున్నారు. ఇలా రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతుండగా.. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. ముఖ్యంగా హెచ్1బీ వీసాలు కొనసాగిస్తారా, రద్దు చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అసలు హెచ్1బీ వీసా అంటే ఏమిటి?


హెచ్-1బీ వీసా (నాన్ ఇమ్మిగ్రెంట్) పొందిన వారు అమెరికాలో తాత్కాలికంగా పని చేయడానికి అర్హులు. దీన్ని సాంకేతిక మరియు ఇంజినీరింగ్, వైద్యశాస్త్ర, గణిత రంగాల్లో పని చేసే విదేశీ నిపుణుల కోసం తీసుకువచ్చారు. అయితే హెచ్1బీ వీసా పొందాలనుకునే వారు కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యాస్థాయి అవసరం. ఈ వీసా పొందిన వారు.. తన ఉద్యోగ స్థితి ఆధారంగానే అమెరికాలో ఉండగల్గుతారు. ముఖ్యంగా ఈ వీసా వ్యవధి మూడు సంవత్సరాలు. గరిష్టంగా దీన్ని ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.


అయితే కృత్రిమ మేధస్సుపై వైట్‌హౌస్ విధాన సలహాదారుగా శ్రీరామకృష్ణన్‌ను ట్రంప్ ప్రకటించిన తర్వాత హెచ్1బీ వీసాలు మరియు ఇమ్మిగ్రేషన్ విధానంపై చర్చ తీవ్రమైంది. నైపుణ్యం కల్గిన వలసదారులకు గ్రీన్‌కార్డ్ కేటాయింపులో దేశ పరిమితులను తొలగించాలని కృష్ణన్ వాదించారు. అలాగే అత్యంత నైపుణ్యం కల్గిన కార్మికుల కోసం వీసా ప్రోగ్రామ్‌ను విస్తరించాలంటూ.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా వత్తాసు పలికారు. దీంతో మరింత రచ్చ మొదలైంది.


మరోవైపు ట్రంప్ మద్దతుదారులు, నేటివ్ అమెరికన్లు.. హెచ్1బీ వీసాలు అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయంటూ ప్రచారం కొనసాగించారు. అలాగే హెచ్1బీ వీసాలు పొందేందుకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(OPT)ను కూడా తీసేయాలని కోరారు. ఇలా రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా.. అసలు హెచ్1బీ వీసాలను అమెరికా కొనసాగిస్తుందా, రద్దు చేస్తుందా అనే చాలా మందిలో మొదలైంది. ఈక్రమంలోనే ఓ విలేకరి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను.. యూఎస్ హెచ్1బీ వీసాలను కొనసాగిస్తుందా, రద్దు చేస్తుందా అని ప్రశ్నించారు.


దీనిపై స్పందించిన ట్రంప్.. ఈ అంశంపై తనకు రెండు వైపులా వాదనలు నచ్చాయన్నారు. అలాగే సమర్థవంతులైన వ్యక్తులు తమ దేశంలోకి రావడాన్ని తాను ఇష్ట పడతానని చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఇంజినీర్ల గురించి మాత్రమే కాదని.. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ మాట చెబుతున్నట్లు ట్రంప్ వివరించారు. దేశ వ్యాపారాలను విస్తరించేందుకు తమకు సమర్థవంతమైన, నైపుణ్యం కల్గిన వ్యక్తులు కావాలని చెప్పారు. అది హెచ్1బీ వీసాలతోనే సాధ్యం అవుతుందని.. అందుకే తనకు రెండు వైపుల వాదనలు నచ్చాయని, సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. ఇదంతా వింటుంటే హెచ్1బీ వీసాలను కొనసాగించాలనే ఉద్దేశం ట్రంప్ మాటల్లో ధ్వనించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com