ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసభ్య ప్రవర్తనకి పాల్పడుతున్న ఉపాధ్యాయుడు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 02:41 PM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు సభ్యత మరిచాడు. అక్షరాలు నేర్పాల్సిన చేతితో బ్యాడ్‌ టచ్‌ చేస్తూ వికృతానందం పొందాడు. గురువు ప్రవర్తన పట్ల విసుగు చెందిన బాలికలు తల్లిదండ్రులకు తెలపడంతో విషయం వెలుగుచూసింది. కోడుమూరు మండలంలోని వెంకటగిరి ప్రాథమిక పాఠశాల (స్పెషల్‌)లో సుమారు 38 మంది బాలబాలికలు విద్యనభ్యసిస్తున్నారు. 1 నుంచి 5 తరగతుల బోధనకు ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలకు 2023లో లక్ష్మన్న అనే టీచర్‌ బదిలీపై వచ్చాడు. సదరు ఉపాధ్యాయుడు బాలికలపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. రానురాను ఉపాధ్యాయుడి వికృత చేష్టలు పెరిగిపోవడంతో బాలికలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధను దిగమింగుకున్నారు. ఆరు నెలల క్రితం ఓ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెళ్లి మందలించినట్లు తెలిసింది. అప్పట్లో సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడంతో సమసిపోయింది. అయినా ఉపాధ్యాయుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడి మాన్పించి మరోచోట చేర్చారు. ప్రవర్తనలో మార్పురాని ఉపాధ్యా యుడు అదే రీతిలో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో రెండు రోజులుగా పలువురు బాలికలు బడికి వెళ్లబోమని తల్లిదండ్రులతో చెప్పారు. ఆరా తీయగా ఉపాధ్యాయుడి వికృత చేష్టలను వివరించారు. కోపోద్రక్తులైన తల్లిదండ్రులు, గ్రామస్థులు బుధవారం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడిని  గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మండల విద్యాశాఖాధికారులు వసంతలక్ష్మి, తైమూర్‌బాషా అక్కడికి చేరుకుని గ్రామస్థులను శాంతింపజేశారు. బాలికలను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com