అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివాహిత మృతదేహానికి శ్మశానవాటికలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. కొత్తపల్లి మండలం మూలపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన గింజాల బాల(25) అదే గ్రామానికి చెందిన రాచపల్లి ప్రసాద్‌ను ఎనిమిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల ప్రసాద్ వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడన్న కారణంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా ఈనెల 19న భార్య బాల అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా భర్త ప్రసాద్ గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన మృతురాలి తల్లి లక్ష్మి తన కుమార్తెను ప్రసాద్ హత్యచేశాడని కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొత్తపల్లి ఎస్‌ఐ జి.వెంకటేష్ కేసు నమోదు చేశారు. దీంతో కొత్తపల్లి తహసీల్ధార్ జి.చిన్నారావు నేతృత్వంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రి ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో డాకర్ సతీష్, నలుగురు పీజీలతో వివాహిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.