ఒకటా రెండా ఏకంగా 160 జాతులు.. 39,725 విదేశీ పక్షులు.. రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలి యా, కెనడా, సైబీరియా తదితర దేశాల నుంచి వలస వచ్చాయి. ప్రధానంగా కాకినాడ జిల్లా కోరంగిలో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం శీతా కాలం నేపథ్యంలో ఆయా దేశాల్లో తీవ్ర మంచు కురుస్తోంది. ఈనేపథ్యంలో ఆహారం కోసం విదేశీ పక్షులన్నీ 5 వేల కిలోమీటర్లకుపైగా ఎగు రుకుంటూ వలస వచ్చాయి. మార్చి రెండోవారం వరకు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి కోసం తిరిగి ఇవన్నీ ఆయా దేశాలకు వెళ్లనున్నాయి.కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో తాళ్లరేవు మండలం కోరంగి నుంచి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో 58 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మడ అడవుల్లో పక్షు లకు పెద్దఎత్తున ఆహారం దొరుకుతుంది. మడ అడవుల్లో చిత్తడి వాతావరణం ఉండడంతో చేపల వేట పక్షులకు సులువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశీ పక్షులు ఏటా శీతాకాలంలో కోరంగి అభయారణ్యానికి వలస వస్తాయి. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఏటా ఈ సమయంలో తీవ్రమైన చలికాలం ఉంటుంది. మంచు మొత్తం భూమిని కప్పేస్తోంది. దీంతో పక్షులకు ఆహారం దొరకదు. ఆహారం కోసం ఆయా దేశాల నుంచి విదేశీ పక్షులు 4 వేల నుంచి 5,500 కిలోమీటర్ల వరకు సుదీర్ఘ ప్రయా ణం చేసుకుంటూ కోరంగికి, ఇతర ప్రాంతాలకు చేరుకుని మార్చి రెండోవారం వరకు ఉంటాయి.