విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలో ప్లాస్టిక్ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల అమ్మకాలు, వినియోగం యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా ప్టాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. డ్రైనేజీలు నిండిపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకంగామారుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన జీవీఎంసీ అధికారులు.. ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ప్లాస్టిక్ విక్రయం/ వినియోగం జరిపే దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాస్‌లు, కవర్లను సీజ్ చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.