ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) విశాఖ ఎయిర్ పోర్టులో రేపు (జనవరి 29) మాక్ డ్రిల్ నిర్వహించనుంది. తుపానులు, వరదలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై ఈ సన్నాహక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), ఏపీఎస్డీఎంఏ, ఎయిర్ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ కు రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తుపానులు, వరదల తదితర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసం తగ్గించడమే లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు.ఈ మాక్ డ్రిల్ లో పోలీసులు, వైద్య సిబ్బంది, ఆపద మిత్ర వాలంటీర్లు పాల్గొంటారు. దీనిపై ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ స్పందించారు. విశాఖ ఎయిర్ పోర్టులో మాక్ డ్రిల్ చూసి ప్రజలు భయాందోళనలకు గురికావద్దని తెలిపారు.