పాకిస్థాన్ చెరలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ తాజాగా వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఉన్నతాధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అభినందన్ ను తీసుకొస్తున్న పాక్ కాన్వాయ్ ను చూడగానే అక్కడ భారీ సంఖ్యలో గుమిగూడిన భారతీయులు భారత్ మాతాకీ జై, హిందుస్థాన్ జిందాబాద్, జైహింద్ అని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ అధికారులు చట్టపరమైన అప్పగింత ప్రక్రియలో పాల్గొంటున్నారు.ఇది ముగిసిన వెంటనే అభినందన్ ను పాకిస్థాన్ అధికారులు భారత్ కు అప్పగించనున్నారు. అభినందన్ కు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ అంబులెన్సును వాఘా-అట్టారి బోర్డర్ వద్దకు అధికారులు తీసుకొచ్చారు.
వైద్య పరీక్షలన్నీ పూర్తిచేశాక అభినందన్ ఆరోగ్యంగా ఉన్నాడని తేలితే ఆయన్ను ఢిల్లీకి తీసుకెళతారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.భారత భూభాగంలోకి చొరబడ్డ పాక్ యుద్ధవిమానాలను వెంబడించిన అభినందన్ ఆ దేశానికి చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చేశారు. ఈ సందర్భంగా తన మిగ్-21 బైసన్ విమానం దెబ్బతినడంతో పాక్ భూభాగంలో పారాచూట్ ద్వారా దిగారు. తాను పాక్ భూభాగంలో దిగినట్లు పసిగట్టిన అభినందన్.. ఐఏఎఫ్ మ్యాపులు, ఇతర కీలక పత్రాలు పాక్ సైన్యం చేతికి చిక్కకుండా నమిలి మింగేశారు.మరికొన్ని పత్రాలను సమీపంలోని నీటిలో ముంచి నాశనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కొందరు దుండగులు తుపాకీతో అభినందన్ పై కాల్పులు జరిపారు. అంతలోనే అక్కడకు చేరుకున్న పాక్ సైన్యం దుండగుల నుంచి కాపాడి అరెస్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa