గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రజల దాహార్తిని తీర్చే కేంద్ర ప్రాయోజిత పథకమైన జల్ జీవన్ మిషన్(జేజేఎం)ను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తమ అవినీతి దాహాన్ని తీర్చుకునేందుకు వాడుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నిధులను డ్రా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. విజయవాడలోని రింగ్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ప్రత్యేకంగా తెరచిన ఖాతాలోని జేజేఎం 5 శాతం గ్రాంట్ నిధులను అడ్డగోలుగా వాడేయడంపై తాజాగా ఏసీబీ డీజీకి ఫిర్యాదు అందడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర మ్యాచింగ్ గ్రాంట్‌తో జేజేఎం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారు. ఈ పథకం గ్రాంట్‌లో 5 శాతం నిధులను ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో స్టేషనరీ, ఇతర ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు ఈ ఐదు శాతం నిధులను భారీగా పక్కదారి పట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులను ఎడాపెడా వాడేశారు. వైసీపీ ప్రభుత్వ జమానాలో 2024వ సంవత్సరం జనవరి 1, 15, 24, 30 తేదీలలో కేవలం నాలుగు రోజులలోనే 400 ట్రాన్సాక్షన్ల ద్వారా ఈ ఐదు శాతం నిధులను సొంత అవసరాలకు వాడేశారు. గత నాలుగేళ్ళుగా మిగిలిన రోజులలో ఏ రేంజ్‌లో జేజేఎం గ్రాంట్ నిధులను చప్పరించేశారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ ఖాతాలో వేల సంఖ్యలో లావాదేవీలు జరిగాయని తెలుస్తోది. దీనిని బట్టి కోట్లాది రూపాయలను డ్రా చేసినట్టుగా అర్థమవుతోంది. ఈఎన్‌సీ ఆఫీసు, ఎస్‌ఈ, ఈఈ అవసరాలకు కాకుండా వేర్వేరు ఖాతాలకు నిధుల బదలాయింపు భారీగా జరిగిందని సమాచారం.