ఉపాధ్యాయుల బదిలీల చట్టం రూపకల్పనపై పాఠశాల విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును పెట్టాలని నిర్ణయించగా.. రెండు రోజుల్లో ముసాయిదా విడుదల చేయనుంది. దాన్ని అందరికీ అందుబాటులో ఉంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనుంది. శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో ఆ శాఖ డైరెక్టర్ విజయరామరాజు ఈ విషయాలను వెల్లడించారు. టీచర్లకు 8, ప్రధానోపాధ్యాయులకు 5 విద్యా సంవత్సరాలు ప్రామాణికంగా బదిలీలు జరిగేలా చట్టంలో నిబంధనలు రూపొందిస్తున్నారు. ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి. సీనియారిటీ జాబితాలను ఆన్‌లైన్ చేస్తారు.
2023లో బదిలీ అయిన టీచర్లకూ అర్హత కల్పించే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సంఘాల నేతలకు డైరెక్టర్ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 7,500 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,600 ఉన్నట్లు చెప్పారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు విషయంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలదే తుది నిర్ణయమన్నారు. మిగులు స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలలకు కేటాయించాలని సంఘాల నేతలు కోరగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియారిటీపై అభ్యంతరాలుంటే డీఈవో, ఆర్జేడీకి ఫిర్యాదు చేయొచ్చని, నేరుగా కోర్టులకు వెళ్తే చర్యలు తీసుకుంటామని విజయరామరాజు స్పష్టం చేశారు.