చెన్నై మెట్రోరైల్వే సంస్థ నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో దశ మెట్రోరైలు మార్గాల ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఒకే స్తంభంపై ఐదు డబుల్ లేయర్డ్ ట్రాక్‌లను నిర్మించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ రైల్వే ట్రాక్‌ల నిర్మాణం చేపడుతున్న ఘనత తమ సంస్థకే దక్కుతుందని సీఎంఆర్‌ఎల్ డైరెక్టర్ అర్జునన్ తెలిపారు. వడపళని ఆర్కాట్‌రోడ్డు ప్రాంతంలో ఈ ఐదు రైలు పట్టాలను నిర్మించడానికి సొరంగాలను నిర్మించాలని ప్రణాళిక రూపొందించామని, దీని అమలుకు రూ.5వేల కోట్లు ఖర్చవుతుందని భావించి, ఈ అదనపు వ్యయభారాన్ని నివారించడానికి ఒకే స్తంభంపై ఐదు డబుల్ లేయర్ల ట్రాక్‌లను నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ వినూత్న విధానం ద్వారా రూ.5వేల కోట్లను ఆదా అవుతుందన్నారు. ఐదు ట్రాక్‌ల బరువు తట్టుకునేలా భూమిలో గట్టి పునాది వేస్తున్నామని, వడపళని నుండి పోరూరు వరకు ఉన్న 4 కిలోమీటర్ల మేర ఐదు ట్రాక్‌లను డబుల్ లేయర్లలో నిర్మిస్తామని, రెండంతస్థుల్లో దిగువ అంతస్థులో రెండు ట్రాక్‌లపై, పై అంతస్థులో మరో రెండు ట్రాక్‌లను నిర్మించి, వాటి పక్కనే మరో లూప్‌లైన్ ట్రాక్ కూడా నిర్మించనున్నామని చెప్పారు. దీంతో నాలుగు రైళ్లను ఒకే స్తంభంపై నడపటానికి వీలు కలుగుతుందన్నారు. రైళ్ల ట్రాక్‌లను మార్చడానికి లూప్‌లైన్ సాయపడుతుందన్నారు.