ప్రభుత్వంపై బురద జల్లాలనే లక్ష్యంతో ఏ ఘటన జరిగినా వైసీపీ రాజకీయం చేస్తోంది’ అని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. శుక్రవారం శ్రీకాకుళంలో డిగ్రీ చదివే యువతిపై ఓ వ్యక్తి భౌతికదాడి చేస్తే, ఆ యువతి స్పృహ తప్పి పడిపోయిందని, దీనిపై వైసీపీ మీడియా, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, వైసీపీ నాయకులు లైంగిక దాడి అంటూ నీచ ప్రచారానికి తెరలేపారన్నారు. అమ్మాయిపై దాడి మాత్రమే జరిగిందని విచారణలో నిర్ధారణ అయిందని, తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
యువతి తల్లితండ్రులు కూడా అత్యాచారం జరగలేదని, భౌతికదాడి మాత్రమే జరిగిందని ఫిర్యాదు ఇచ్చినా, కావాలనే వైసీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఘటనలో నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేశామన్నారు. గతంలో పుంగనూరులో ఓ మైనర్ బాలిక హత్య ఘటనను రేప్‌గా చిత్రీకరించడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. వైసీపీ ఫేక్ ప్రచారం, ట్వీట్‌లతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.ఎక్కడైనా అత్యాచార ఘటనలు జరిగితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో కంత్రీ పనులు చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేసినోళ్లు మంత్రులు, ఎంపీలుగా చలామణి అయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో 10 శాతం నేరాలు తగ్గాయన్నారు. దిశ యాప్ పనిచేస్తే.. దిశ చట్టం నిజంగా ఉంటే గత ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అన్ని అత్యాచారాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వాడకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే.. ఓ చిన్నారిపై అత్యాచారం జరిగితే పోక్సో కేసు పెట్టి 20 ఏళ్లు జైలుశిక్ష వేయించిన ప్రభుత్వం తమదని హోంమంత్రి అనిత చెప్పారు.