రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల ఫీజులు చెల్లించడం లేదని, వారికి అండగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. ప్రభుత్వానికి హెచ్చరికగా ఫిబ్రవరి 5వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రంలో ‘ఫీజుపోరు’ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు, ముఖ్య నాయకులుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ పేదరికం అనేది ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదన్న ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
ఈ పథకం వల్ల ఎంతో మంది పేదలు ఇంజనీరింగ్, మెడిసిన్ అభ్యసించి జీవితంలో స్థిరపడ్డారని తెలిపారు. వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం అమలు చేశారన్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి కోసం విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు తెచ్చారని చెప్పారు. ఐదేళ్ల జగన్ పాలనలో విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యేనాటికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.1780 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందన్నారు. ఆ బకాయిలను రాజకీయ కోణంలో చూడకుండా చెల్లించిన ఘనత వైయస్ జగన్‌దని తెలిపారు. ఏ ప్రభుత్వాలు మారినా కొన్ని పథకాలకు సంబంధించి బకాయిలు ఉంటాయని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది మార్చిలోనే రూ.708 కోట్లు విడుదల చేశామని, కానీ అదే సమయంలోనే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిసిపోయిందన్నారు. పోలింగ్ తర్వాత కొందరి ఖాతాల్లో జమ అయ్యిందని, అంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు ఆగిపోయాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని, త్వరలోనే అకాడమిక్ ఇయర్ కూడా ముగుస్తుందన్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. దీని వల్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు కూర్చొబెడతామని అంటున్నారని ఇప్పటికే ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న వారు,ఉద్యోగాలకు ఎంపికైన వారు కూడా సర్టిఫికెట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు.
ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్‌లలో విద్యార్థులు వినతిపత్రాలు అందిస్తున్నారన్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చినా బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. అధికారం మాత్రమే పరమావధిగా చేసుకుని వెళ్లే పార్టీ వైయస్ఆర్‌సీపీ కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతు సమస్యలు, విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3900 కోట్లు చెల్లించాలని, ఇదే డిమాండ్‌తో ఫిబ్రవరి 5వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రంగా ఫీజు పోరు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని, ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు.