ఓ యువకుడి ప్రాణాన్ని తాను పెట్టుకొన్న హెల్మెటే కాపాడింది. హెల్మెట్ కారణంగా.. తాను ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నానంటూ.. అతడు చేసిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధుసూధనరావు అనే వ్యక్తి ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో దుర్గమ్మను దర్శించుకున్నారు.అనంతరం బైక్‌పై ఇబ్రహీంపట్నం వైపు బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యలో అతడు ప్రయాణిస్తున్న బైక్‌ను టిప్పర్ ఢీ కొట్టింది. అయితే హెల్మెట్ ధరించడం వల్ల అతడికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇక ఇదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ ప్రమాద ఘటనపై వారు ఆరా తీశారు.
ఆ క్రమంలో టిప్పర్ ఢీ కొట్టినా మధుసూధనరావుకు ఎటువంటి గాయాలు కాలేదు.దీంతో హెల్మెట్ ధరించడం వల్ల.. ప్రాణాలకు ఎటువంటి అపాయం ఉండదని.. ఓ వేళ అనుకోని ప్రమాదం జరిగినా.. ప్రాణాలతో సురక్షితంగా బతికి బయట పడవచ్చని భవానీ పురం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. అందులోభాగంగా మధుసుధనరావుతో సీఐ ఓ వీడియో చేయించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు వీక్షించారు.అనంతరం ఈ ఘటనపై సీఐ ఉమామహేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం వల్ల మీ కుటుంబాలకు... మిమ్మల్ని దూరం కాకుండా రక్షిస్తుందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు సూచించారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న నగర ప్రజలకు సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు.