హిందూ ధర్మాలు, ఆలయాలను కాపాడాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామి పండుగే రథసప్తమి అని చెప్పారు. భూప్రపంచానికి సూర్యోదయంతోనే వెలుగులు నిండుతాయని అన్నారు. సీఎం చంద్రబాబు సూచనతో అరసవెల్లిలో జరిగే రథసప్తమి వేడుకలను, రాష్ట్రంలో జరిగే వేడుకలను ఈ ఏడాది రాష్ట్ర పండుగగా గుర్తించామని అన్నారు. అరసవెల్లిలో జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబు పట్టవస్త్రాలు సమర్పించాల్సి ఉందని... కానీ ఎన్నికల కోడ్ వల్ల అధికారులనే పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలిచ్చామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తుచేశారు.నెల్లూరు మూలాపేట శివాలయంలోని సూర్యభగవానుడికు ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు.
అనాధిగా తమ కుటుంబం రథసప్తమి పూజలు నిర్వహిస్తుందని వివరించారు. రాష్ట్రంలో పలు ఆలయాల పుననిర్మాణానికి నిధుల కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాలో 18 ఆలయాల పున నిర్మాణాలకు రూ.38కోట్ల నిధులు విడుదలయ్యాయని ప్రకటించారు. మహాశివరాత్రి రోజున శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, దాక్షారామంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. మూలాపేట శివాలయం అభివృద్ధికి మంత్రి నారాయణతో కలిసి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఏపీలో రాతికట్టడాలకు గత జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడం వల్ల పవిత్రతను కోల్పోయాయని తెలిపారు. ఆ రంగులు తొలగించి, వాటిని కాపాడుతామన్నారు. చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పారు. అందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం. భక్తులు తమ ప్రభుత్వానికి అండగా ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.