తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమిగా మాజీ మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. మేము ఓడి గెలిచాం..వాళ్లు గెలిచి ఓడిపోయారని పేర్కొన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికపై మాజీ మంత్రి రోజా ఎక్స్ ఖాతాలో స్పందించారు. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో మా అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి..తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ అయిన డా శిరీష గారిని విధుల నిర్వహణలో అవమానించారు. కార్పొరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ శిరీష ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం? తిరుపతి ఎంపి గురుమూర్తి ప్రయాణిస్తున్న బస్సు పై దాడి, నిన్న బస్సులో బయలు దేరిన వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు నేడు రాకపోవడం, మాతో నిన్న వచ్చి నేడు మాకు వ్యతిరేకంగా ఓటు వేయడం నిన్న రాత్రి జరిగిన పరిణామాలకు కొనసాగింపు కాదా? ఒక్క ఓటు ఉన్న టీడీపీ కార్పొరేటర్ గెలిచారు. మేము విప్ జారీ చేశాం. రిటర్నింగ్ అధికారి మా సభ్యులు విప్ దిక్కరించినందున వారిని అనర్హులుగా ప్రకటించాలి. అవేమీ జరగలేదు అంటే ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయో అర్దం అవుతుంది. అంతిమంగా ఒకటే చెపుతున్నా.. `మేము ఓడి గెలిచాం వాళ్ళు గెలిచి ఓడిపోయారు`. మేము ఓడిపోలేదు.. వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం గెలిచింది.స్వామి వారితోపాటు ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెపుతారు..!! అంటూ రోజా ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.