నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నామని తెలిపారు. ‘‘టీడీపీలో అభిప్రాయ బేధాలు అని కొంత మంది ప్రచారం చేశారు. మా టిడిపి కుటుంబంలొ ఎటువంటి విభేధాలు లేవు, నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించాను. వారు అన్నీ పరిశీలించి కృష్ణకుమారి పేరును చైర్మన్‌గా ఎంపిక చేశారు. కొంతమంది కావాలనే మాపై అసత్య ప్రచారం చేశారు’’ అంటూ మండిపడ్డారు. ఓటింగ్ జరగదంటూ వైసీపీ సభ్యులు పడ్డ ఆనందం ఆవిరి అయ్యిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా మున్సిపల్ చైర్మన్ టీడీపీ దక్కించుకుందని తెలిపారు. నందిగామను అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పనులు చేయకుండా దొంగ బిల్లులతో దోపిడీ చేశారని ఆరోపించారు. వాటి పై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సౌమ్య వెల్లడించారు.