భారత్-చైనా సరిహద్దు పరిస్థితిపై ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. రాహుల్ పార్లమెంటు ప్రసంగంలో తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇరువైపులా ట్రెడిషనల్ పెట్రోలింగ్ డిస్ట్రబెన్స్‌పైనే ఆర్మీ చీఫ్ చెప్పారని, ఆయన చెప్పని మాటలు చెప్పినట్టుగా రాహుల్ మాట్లాడటం సరికాదని అన్నారు.''జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో రాహుల్ గాంధీ బాధ్యతారహిత వ్యాఖ్యలకు పాల్పడడం విచారకరం. భారత భూభాగం ఏదైనా చైనా చేతుల్లోకి వెళ్లిందంటే అది ఆక్సాయ్ చిన్‌లోని 38,000 చదరపు కిలోమీటర్లు భూభాగం మాత్రమే. 1962 యుద్ధం తరువాత ఇది జరిగింది. 1963లో పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా చైనాకు 5,180 చదరపు కిలోమీటర్ల భూమిని ధారాదత్తం చేసింది. చరిత్రపై రాహుల్ అవగాహన పెంచుకోవాలి" అని రాజ్‌నాథ్ సింగ్ సోషల్‌మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై సోమవారంనాడు జరిగిన చర్చలో పాల్గొంటూ, 'మేక్ ఇన్ ఇండియా'లో భారత్ విఫలమైందని, ఆ కారణంగానే చైనా దేశంలో తిష్టవేసుకు కూచుందని ఆరోపించారు. చైనా బలగాలు మన భూభాగంలోనే ఉన్నాయనే విషయాన్ని ప్రధాని మోదీ ఖండించారని, దీనిపై ఆర్మీ చీఫ్ మాత్రం వాస్తవం మాట్లాడారని అన్నారు. చైనా బలగాలు మన భూభాగంలోనే ఉన్నాయని ఆర్మీ చీఫ్ చెప్పినట్టు రాహుల్ పేర్కొన్నారు. తయారీ రంగంలో భారత్ వెనుకబడటం వల్ల చైనా వస్తువులు దేశంలోకి వస్తున్నాయని అన్నారు. ఉత్పత్తిరంగంపై భారత్ పూర్తి స్థాయి దృష్టిసారించాలని పేర్కొన్నారు.